అంతర్జాతీయ సమస్యలపై చర్చలకు ముఖ్య వేదిక బ్రిక్స్‌ : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ :   ప్రపంచ అభివృద్ధి అజెండాకు సంబంధించిన కీలక సమస్యలపై చర్చలకు, సంభాషణకు బ్రిక్స్‌ సదస్సు ముఖ్యమైన వేదికగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. దేశాల మధ్య సన్నిహిత సహకారాన్ని విలువైనదిగా భారత్‌ భావిస్తోందని అన్నారు. రష్యాలోని కజాన్‌ నగరంలో నిర్వహిస్తున్న 16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు రెండు రోజుల పర్యటన కోసం బయలుదేరడానికి ముందు మంగళవారం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచాభివృద్ధి అజెండాకు సంబంధించిన కీలకమైన సమస్యలతో పాటు బహుపాక్షికత, పర్యావరణ మార్పులు, ఆర్థిక సహకారం, సరఫరా గొలుసులను నిర్మించడం, ఇతరులతో పాటు ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడంపై చర్చించనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. కజాన్‌ పర్యటనతో భారత్‌, రష్యాల మధ్య ‘ప్రత్యేకమైన మరియు విశేష అధికారాల వ్యూహాత్మక భాగస్వామ్యం’ను బలపరుస్తుందని అన్నారు.

గతేడాది కొత్త సభ్యుల చేరికతో బ్రిక్స్‌ విస్తరణ ప్రపంచ ప్రయోజనాలు మరియు సమానత్వం అజెండాను జోడించిందని అన్నారు. గతేడాది జోహెన్స్‌బర్గ్‌లో జరిగిన దాని శిఖరాగ్ర సమావేశంలో బ్రిక్స్‌ విస్తరించిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది. బ్రిక్స్‌ సదస్సులో భాగంగా ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది.

➡️