ఇది రోడ్‌ షో కాదు.. పోరాటాల షో : బృందాకరత్‌

brinda karat election campaign

బూర్జువా పార్టీల మాయాజాలాన్ని తిప్పికొట్టాలి
లాల్‌ జెండా ముద్దు బిడ్డ మల్లు లక్ష్మిని గెలిపించాలి
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఇది రోడ్‌ షో మాత్రమే కాదు.. పోరాటాల షో అని.. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ అన్నారు. ఎన్నికలు వచ్చాయంటే వానాకాలంలో వచ్చే కప్పల్లాగా పూటకో పార్టీ మారుతున్నారని, ఎర్రజెండా పట్టుకున్న కార్యకర్తలు, నాయకులు నికరంగా ఉంటారని తెలిపారు. లాల్‌ జెండా ముద్దుబిడ్డ మల్లు లక్ష్మిని గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు లక్ష్మి గెలుపును కాంక్షిస్తూ మంగళవారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన రోడ్‌ షోలో బృందా కరత్‌ పాల్గొన్నారు. ఎర్రజెండాలతో హుజూర్‌నగర్‌ గడ్డ ఎరుపెక్కింది. ప్రజలు పూల జల్లు కురిపించారు. అనంతరం పొట్టిశ్రీరాములు సెంటర్‌లో జరిగిన సభలో బృందా కరత్‌ ప్రసంగించారు. ఎన్నికల్లో బిజెపి, బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి గెలవాలని చూస్తున్నారన్నారు. వారికి ఓట్లతో బుద్ధిచెప్పాలని కోరారు. ఎర్రజెండా ఒక సిద్ధాంతం కోసం, పేదల కోసం పని చేస్తోందని చెప్పారు. తమ పార్టీ పోటీ చేస్తోందని వ్యక్తుల కోసం, పార్టీ కోసం కాదని, పేద ప్రజల కోసమని వివరించారు. ఎన్ని కష్టాలున్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాడేది ఒక ఎర్రజెండా మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్‌ ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రజలకు చేసిందేమీలేదన్నారు. మల్లు లక్ష్మిని గెలిపిస్తే ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజాస్వామ్యం, ధనస్వామ్యం మధ్య జరుగుతు న్న ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరూ ఆలోచించి సిపిఎంకు ఓటేసి మల్లు లక్ష్మిని గెలిపించాలని కోరారు. సిపిఎం పట్టణ కార్యదర్శి నాగారపు పాండు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, నాయకులు పారేపల్లి శేఖర్‌ రావు, కొలిశెట్టి యాదగిరి, నెమ్మాది వెంకటేశ్వర్లు, కోటా గోపి, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.

➡️