Budget : రాజకీయ లబ్ధే లక్ష్యం

Feb 1,2025 23:55 #Bihar, #Union Budget
  • ఎన్నికలు జరిగే ఢిల్లీ, బీహార్‌పై ప్రత్యేక ఫోకస్‌

న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌లో ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించారు. అవన్నీ పాలక పక్షానికి రాజకీయ లబ్ది చేకూర్చేవే. మధ్య తరగతి ప్రజలకు చేరువయ్యేందుకు ఆమె తన బడ్జెట్‌లో అనేక వరాలు ప్రకటించారు. ముఖ్యంగా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో వేతన జీవుల ఓట్లు దండుకునేందుకు మునుపెన్నడూ లేని విధంగా వారికి ఆదాయపన్ను మినహాయింపులు ఇచ్చారు. తద్వారా ఎన్డీఏ ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి ప్రజల పక్షానే ఉన్నదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక మిత్రపక్షమైన జేడీయూని ప్రసన్నం చేసుకునేందుకు ఆ రాష్ట్రంపై వరాల జల్లులు కురిపించారు. ఆమె తన బడ్జెట్‌ ప్రసంగంలో బీహార్‌ పేరును ఆరుసార్లు ప్రస్తావించారు. పనిలో పనిగా మిథిలాంచల్‌నూ (ఉత్తర బీహార్‌) గుర్తు చేశారు. పూర్వోదయ పథకంలో భాగంగా బీహార్‌లో ఫుడ్‌ టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేస్తామని, రైతుల ఆదాయాన్ని పెంచుతామని, యువతకు నైపుణ్యాన్ని కల్పిస్తామని, మఖనా బోర్డును ఏర్పాటు చేస్తామని, గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని, పాట్నా ఎయిర్‌పోర్టును విస్తరిస్తామని….ఇలా హామీలు ఇచ్చుకుంటూ పోయారు. మిథిలాంచల్‌లో పశ్చిమ కోసీ కెనాల్‌ ప్రాజెక్ట్‌, ఐఐటీ పాట్నాలో మౌలిక సదుపాయాల పెంపు వంటివి కూడా ఈ హామీల జాబితాలో ఉన్నాయి. దేశంలో వ్యావసాయకంగా వెనుకబడిన వంద జిల్లాలను గుర్తించి అక్కడ వ్యవసాయాభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన పథకం 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆమె చెప్పారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ రుణ పరిమితిని రూ. 5 లక్షల నుండి రూ.7 లక్షలకు పెంచుతామని కూడా తెలిపారు.

➡️