న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కుంభమేళా ఘటనపై సమాధానమివ్వాలి అని నినాదాలు చేస్తూ ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లాయి. మృతుల జాబితాను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత మృతుల సంఖ్యను వెల్లడించేందుకు యోగి ప్రభుత్వం నిరాకరించిందని, వాస్తవ సంఖ్యను దాచిపెడుతోందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ అజెండాపై బిజెనెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
నిబంధనలు 267 కింద ఇచ్చిన మొత్తం 9 నోటీసులను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ తిరస్కరించారు. 2022 డిసెంబర్ 8, డిసెంబర్ 19న రూల్ నెంబర్ 267 కింద ఇచ్చిన వివరణను సభ్యులు గుర్తు చేసుకోవాలని రాజ్యసభ చైర్మన్ పేర్కొంటూ .. ఈనోటీసులు ఆ ఆదేశాలకు అనుగుణంగా లేనందున తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కుంభమేళా నిర్వహణలో లోపాలు, రాజ్యాంగాన్ని అగౌరవపరచడంపై నోటీసులు వచ్చాయని అన్నారు. కుంభమేళా ఘటనపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.