న్యూఢిల్లీ : నూతన పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం కలిగిన వారికి పన్ను మినహాయింపును ఇస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని వెనుక అసలు ఉద్దేశ్యం వేరేగా ఉందని తెలుస్తోంది. దేశంలోని హెచ్చు ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. మధ్యతరగతి, వేతన జీవుల ఆదాయాలు తగ్గిపోయాయి. దీంతో వస్తువులకు డిమాండ్ తగ్గింది. ఈ క్రమంలో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. అమ్మకాలు, ఉత్పత్తి లేక కార్పొరేట్ల ఆదాయాలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అనివార్యంగా పన్ను శ్లాబుల్లో మార్పులు చేయాల్సి వచ్చిందనేది సుస్పష్టం.
పన్ను వ్యవస్థను సరళతరం చేయడానికి, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి పన్ను శ్లాబును పెంచామని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. కొత్త పన్ను విధానం ఆకర్షణీయమైన పన్ను రేట్లను అందిస్తుందన్నారు. నూతన పన్ను విధానం ప్రకారం.. ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపును పొందవచ్చు. పాత విధానంతో పోలిస్తే కొత్త విధానంలో తక్కువ పన్ను రేట్లు విధిస్తారు. ఇప్పటి వరకు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం పన్ను రేట్లు అమల్లో ఉన్నాయి. కొత్త విధానం ప్రకారం రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా అవుతుంది. ఇతర శ్లాబుల్లో కూడా మార్పులు ఉంటాయి. రూ.25 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.1.10 లక్షలు ఆదా అవుతుందని మంత్రి తన ప్రసంగంలో తెలిపారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి రెండో వారంలో నూతన పన్ను విధానంపై బిల్లును తీసుకురానున్నట్లు వెల్లడించారు. నూతన విధానంలో కొత్త శ్లాబుల ప్రకారం మొదటి రూ.4లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. నూతన పన్ను విధానంలో లక్షలాది పన్ను చెల్లింపులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. పన్ను భారాన్ని తగ్గించడం, పన్ను ఫైలింగ్ ప్రక్రియను సరళతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు.
అద్దె ఆదాయంపై పరిమితి పెంపు
సీనియర్ సిటిజన్‌లకు, ఇళ్లు, భవనాలపై అద్దె ఆదాయాన్ని పొందేవారికి కేంద్రం కొంత ఊరట కల్పించింది. అద్దె ఆదాయంపై వార్షిక టిడిఎస్ మినహాయింపు పరిమితిని రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచింది. తద్వారా చిన్న చెల్లింపులను స్వీకరించే చిన్న పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు.
కొత్త పన్ను శ్లాబు వివరాలు..
రూ.0-4 లక్షలు – సున్నా
రూ.4-8 లక్షలు – 5 శాతం
రూ.8-12 లక్షలు – 10 శాతం
రూ.12-16 లక్షలు – 15 శాతం
రూ.16-20 లక్షలు – 20 శాతం
రూ.20-24 లక్షలు – 25 శాతం
రూ.24 లక్షల పైన 30 శాతం