బుల్డోజర్‌ కూల్చివేతలు ఫ్యాషన్‌ అయిపోయింది

Feb 13,2024 10:28 #Madhya Pradesh

స్థానిక సంస్థల అధికారులపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆగ్రహం

క్రమశిక్షణా చర్యలకు ఆదేశం

న్యూఢిల్లీ : బుల్డోజర్లతో అక్రమంగా ఇళ్ల కూల్చివేత ఈ మధ్య ఫ్యాషన్‌గా మారిందని మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ ఇళ్ల కూల్చివేతకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ సంబంధిత మున్సిపల్‌ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. పిటిషనర్‌కు నష్టపరిహారంగా లక్ష రూపాయలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఉజ్జయిని మున్సిపల్‌ కార్పొరేషన్‌ (యుఎంసి) అనుసరించాల్సిన విధి విధానాలను సక్రమంగా అనుసరించకుండానే తన ఇళ్లను కూల్చివేసిందని, ఇందుకు తనకు నష్టపరిహారం ఇప్పించాలంటూ పిటిషనర్‌ రాధా లాంగ్రీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్‌ వివేక్‌ రూయిసా తీర్పునిస్తూ, చట్టప్రకారం ఇళ్ల కూల్చివేతకు అనుసరించాల్సిన పద్ధతులేవీ చేపట్టకుండానే ఇళ్లను కూల్చివేయడమనేది స్థానిక యంత్రాంగానికి, స్థానిక సంస్థలకు ఒక ఫ్యాషన్‌గా మారిందని వ్యాఖ్యానించింది. ఈ విషయం అనేకసార్లు కోర్టు దృష్టికి వచ్చిందని చెప్పారు. సహజ న్యాయం ప్రకారం చేపట్టాల్సిన చర్యలు చేపట్టకుండా, పత్రికలో ప్రచురించకుండా ఏ ఇంటినైనా కూల్చివేయడమన్నది పరిపాటి అయిపోయిందని పేర్కొంది. ఈ కేసుకు సంబందించి పిటిషనర్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరిపై కేసు నమోదు చేశారని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇంటి నెంబరు 466 పర్వేజ్‌ ఖాన్‌కు చెందినదిగా పత్రాలు వున్నాయని, అంతేకానీ ఆ ఇల్లు లాంగ్రీకి చెందినదిగా లేదని యుఎంసి ఆరోపించింది. అయితే పర్వేజ్‌ ఖాన్‌ అనే పేరుతో ఎవరూ లేరని కోర్టు కనుగొంది. భవనాల అధికారి సంఘటనా ప్రదేశానికి వెళ్లలేదని, అక్కడ ఎవరితోనూ మాట్లాడి విషయాలు కనుగొనలేదని కోర్టు పేర్కొంది. కేవలం మౌఖిక సమాచారం ప్రాతిపదికన కూల్చివేతకు చర్యలు తీసుకున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.

➡️