గోండియా : మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్‌ఆర్‌టిసి)కు చెందిన బస్సు బోల్తా పడిన ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. గోండియా జిల్లాలోని దవ్వ గ్రామంలో శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు కలెక్టర్ ప్రజీత్ నాయర్ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నట్లు చెప్పారు. మితిమీరిన వేగం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించామని, వీరిలో ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.