ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : తమిళనాడులోని ఈరోడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి బుధవారం ఉప ఎన్నిక జరిగింది. ఈరోడ్‌లో 64.02 శాతం ఓటింగ్ నమోదైంది. మిల్కిపూర్‌లో 65.25 శాతం నమోదైంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతున్న మిల్కిపూర్ నియోజకవర్గంలో పోలీసులు ఓటర్ల ఐడిలను తనిఖీ చేస్తున్నారని, వారిలో ‘భయం కలిగించడానికి’ అని పేర్కొన్నారు. పోలింగ్ బూత్ వెలుపల ఒక వ్యక్తి ఐడి కార్డును తనిఖీ చేస్తున్న పోలీసు అధికారి చిత్రాన్ని పంచుకున్నారు. అయోధ్య సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్ కరణ్ నాయర్ ఈ ఆరోపణలను ఖండించారు. ఆ చిత్రంలో ఉన్న ఐడి కార్డును తనిఖీ చేస్తున్న వ్యక్తి పోలింగ్ ఏజెంట్ అని అన్నారు. ఫైజాబాద్ ఎంపి అవధేష్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ.. బిజెపి ఓటర్లను ప్రభావితం చేయడానికి, బెదిరించడానికి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చిందని ఆరోపించారు.
