న్యూఢిల్లీ : ఢిల్లీలో హోరాహోరీగా సాగిన శాసనసభ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ఈ నెల 5న 70 స్థానాలున్న అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం జరిగే పోలింగ్‌లో 1.56 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరిలో 83.76 లక్షల మంది పురుషులు కాగా 72.36 లక్షల మంది మహిళలు, 1,267 మంది ఇతరులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో అధికార అమ్‌ఆద్మీ, ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు జరగనుందనే ప్రచారం వున్నా, కొన్ని ఒపీనియన్ పోల్స్, పలు సర్వేలు మాత్రం అమ్‌ఆద్మీ పార్టీకే మరోసారి విజయం చేకూరుతుందని అంచనా వేశాయి. 2015లో 67, 2020లో 62 శాసనసభ స్థానాలు గెలుచుకున్న ఆప్ ఈసారి కూడా అదే దూకుడు ప్రదర్శించగలమన్న ధీమాతో ఉంది. గత ఎన్నికల్లో బిజెపి కేవలం ఎనిమిది సీట్లతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఒకప్పుడు దేశ రాజధానిలో అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్‌కు ఓటర్లు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. 2015 ఎన్నికల్లో బిజెపికి కేవలం మూడు స్థానాలు మాత్రమే దక్కాయి. కాగా ఢిల్లీ శాసనసభ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్, తమిళనాడులోని ఎరోడ్ (ఈస్ట్) అసెంబ్లీ స్థానాలకు కూడా బుధవారమే పోలింగ్ జరుగుతుంది. ప్రచారానికి చివరి రోజున ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సంయుక్తంగా కల్కా జీ శాసనసభ స్థానంలో రోడ్‌షో నిర్వహించారు.
