EC: రూ.4,658 కోట్లు సీజ్‌

  • లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే తొలిసారి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో/ అమరావతి బ్యూరో : లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి భారీగా నగదు పట్టుబడినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) వెల్లడించింది. సోమవారం ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి ఒకటి నుంచి ఏప్రిల్‌ 13 వరకు తొలి విడతలో డబ్బు, మద్యం, బంగారం, ఇతర వస్తువుల రూపంలో మొత్తం రూ. 4,658.16 కోట్లు అంటే సగటున రోజుకు రూ.100 కోట్ల మేర పట్టుబడింది. ఇందులో నగదు రూ.395.39 కోట్లు కాగా, బంగారం, వెండి వంటి విలువైన లోహాల రూపంలో రూ.562.10 కోట్లు పట్టుబడింది. అలాగే రూ.489.31 కోట్ల విలువ చేసే 3.58 కోట్ల లీటర్ల మద్యం కూడా పట్టుపడింది. దీంట్లో సింహభాగం డ్రగ్స్‌దే. పట్టుబడిన మొత్తం రూ.4,658.16 కోట్లలో మాదక ద్రవ్యాల వాటానే 45 శాతం దాకా ఉంది. అధికారులు జరిపిన తనిఖీల్లో మొత్తం రూ.2,068.85 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ దొరికాయి. 2019 ఎన్నికల సమయంలో రూ.1,279.9 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ఇక టివిలు, ఫ్రిజ్‌లు, మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు, బహుమతుల రూపంలో రూ.1,142.49 కోట్ల దాకా పట్టుబడ్డాయి. 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక మొత్తం అని ఇసి పేర్కొంది.గత లోక్‌సభ ఎన్నికల సమయంలో రూ. 3,475 కోట్లకు పైగా పట్టుబడింది. అప్పటితో పోలిస్తే ఇది 34 శాతం అధికమని తెలిపింది. సమగ్ర ప్రణాళిక, సంయుక్త కార్యాచరణ, దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాల మధ్య సమన్వయంతో పాటు పౌరుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకో గల్గుతున్నామని ఇసి ఒక ప్రకటనలో తెలిపింది.

మొదటి రెండు స్థానాల్లో రాజస్థాన్‌, గుజరాత్‌
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ రూపాల్లో పట్టుబడిన రూ. 4,658.16 కోట్లలో రాజస్థాన్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో మార్చి ఒకటి నుంచి ఏప్రిల్‌ 13 వరకు మొత్తం రూ. 778.52 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత రూ. 605 కోట్లతో గుజరాత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక తమిళనాడులో రూ.460.8 కోట్లు, మహారాష్ట్రలో రూ.431.3 కోట్లు, పంజాబ్‌లో రూ. 311.8 కోట్లు పట్టుబడింది. ఎన్నికల అక్రమాలు, అవకతవకల్లో అత్యల్పంగా లఢక్‌, లక్షద్వీప్‌ ప్రాంతాలు నిలిచాయి.

రాష్ట్రంలో రూ.125.97 కోట్ల సొత్తు స్వాధీనం: సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.125.97 కోట్లు విలువజేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తంలో రూ.32.15 కోట్ల నగదు, రూ.19.72 కోట్ల విలువైన లిక్కర్‌, రూ.4.06 కోట్ల విలువైన డ్రగ్స్‌, రూ.57.14 కోట్ల విలువైన ప్రెషస్‌ మెటల్స్‌, రూ.12.89 కోట్ల విలువైన ఉచితాలు/ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపారు. అంతర్‌ రాష్ట్ర చెక్‌పోస్టులు, రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టులు, పటిష్టమైన నిఘా, అధికారులు, పోలీసులు నిరంతరాయంగా గస్తీకాయడంతోపాటు పౌరుల భాగస్వామ్యం, సాంకేతిక సహకారం వల్లే ఈ సొత్తును స్వాధీనం చేసుకోగలిగామని పేర్కొన్నారు.

నగదు: రూ.395.39 కోట్లు
బంగారం ఇతర లోహాలు: రూ.562.10 కోట్లు
3.58 కోట్ల లీటర్ల మద్యం: రూ.489.31 కోట్లు
మాదకద్రవ్యాలు: రూ.2,068.85 కోట్లు
బహుమతులు : రూ.1,142.49 కోట్లు
మొత్తం : రూ. 4,658.16 కోట్లు

➡️