- బావి నుంచి నీరు తీసుకున్నాడని… దళితుడిని కొట్టి చంపిన వైనం
భోపాల్ : స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు దాటినా దేశంలో కుల వివక్ష అంతం కాలేదు. ఏదో ఒక రూపంలో అది కోరలు చాపుతూనే ఉంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఓ యువకుడు పెత్తందార్ల కుల దురహంకారానికి బలయ్యాడు. బోరు బావి నుంచి నీరు తీసుకోవడమే ఆ దళిత యువకుడు చేసిన నేరం. గ్రామ సర్పంచ్, అతని భార్య సహా ఐదుగురు వ్యక్తులు ఆ యువకుడిపై దాడి చేసి కొట్టి చంపారు. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా ఇందర్‌గర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్వాలియర్ జిల్లాకు చెందిన దళిత యువకుడు నరద్ జాతవ్ మంగళవారం గ్రామంలోని తన బంధువు పొలానికి బోరు బావి నుండి నీరు పెడుతున్నాడు. ఆ సమయంలో గ్రామ సర్పంచ్ పదమ్ సింగ్ ధాకడ్, అతని భార్య దఖా బారు, మరో ముగ్గురు సహాయకులు అతనిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. జాతవ్‌పై కర్రలు, రబ్బరు పైపులతో దుండగులు విచక్షణారహితంగా దాడి చేయడం ఆ వీడియోలో కన్పించింది. బోరు బావి విషయంలో ఓబీసీలైన ధాకడ్ కులానికి, ఎస్సీ జాతవ్ కులానికి మధ్య వివాదం నడుస్తోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితులపై హత్య కేసు, ఎస్సీ-ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేశారు. గ్రామ సర్పంచ్ సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూరప్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. హతుడి కుటుంబానికి ముఖ్యమంత్రి విచక్షణ నిధి నుండి నాలుగు లక్షల రూపాయలు అందించాలని కూడా ఆయన ఆదేశించారు. గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని శివపురి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న ప్రద్యుమన్ సింగ్ తోమర్‌కు సూచించారు.