ఉగ్రవాదులను పట్టుకుని దాడులపై ప్రశ్నించండి

  • కేంద్రానికి ఫరూక్‌ అబ్దుల్లా సూచన
  • ఈ వ్యాఖ్యలపై కేంద్రం స్పందించాలి : శరద్‌పవార్‌

శ్రీనగర్‌ : ఉగ్రదాడులు పెరగడం వెనుక సూత్రధారులను గుర్తించడం కోసం ఉగ్రవాదులను హతమార్చడం కంటే వారిని పట్టుకోవాలని జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) అధ్యక్షులు ఫరూక్‌ అబ్దుల్లా సూచించారు. పట్టుకున్న ఉగ్రవాదులను విచారించడం ద్వారా ఈ దాడులు నిర్వహించే విస్తృత నెట్‌వర్క్‌లు, మాస్టర్‌మైండ్స్‌ గురించి తెలుస్తుందని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బుద్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. జమ్ముకాశ్మీర్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం ఏర్పడగానే ఇలా ఎందుకు జరుగుతోంది? ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తులే ఇలా చేశారా? అనే సందేహం ఉంది. ఉగ్రవాదులను పట్టుకుంటే ఇలా ఎవరు చేస్తున్నారో తెలుస్తుంది. అందుకే వారిని చంపకూడదు. వారిని పట్టుకోవాలి. వారి వెనుక ఎవరున్నారో అడగాలి. ఒమర్‌ అబ్దుల్లాను అస్థిరపరిచేందుకు ప్రయత్నించే ఏజెన్సీ ఉందో లేదో చెక్‌ చేయాలి’ అని అన్నారు. ఉగ్రదాడుల వెనుక పాకిస్తాన్‌ ప్రమేయం ఉందా లేదా అన్నది కూడా దర్యాప్తులో తెలుస్తుందని పేర్కొన్నారు.
ఫరూక్‌ వ్యాఖ్యలను

కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలి : శరద్‌ పవార్‌

ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని మహారాష్ట్రకు చెందిన ఎన్‌సిపి-ఎస్‌పి చీఫ్‌ శరద్‌ పవార్‌ డిమాండ్‌ చేశారు. నివారం బారామతిలో జరిగిన మీడియా సమావేశంలో శరద్‌ పవార్‌ మాట్లాడారు. ‘జమ్ముకాశ్మీర్‌లో అత్యున్నత వ్యక్తి ఫరూక్‌ అబ్దుల్లా. జీవితమంతా అక్కడి ప్రజలకు సేవ చేశారు. ఆయన చిత్తశుద్ధి, నిజాయతీపై నాకు ఎలాంటి సందేహం లేదు. అలాంటి నాయకుడు ఏదైనా ప్రకటన చేస్తే, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోంమంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించాలి. ఆ పరిస్థితిని ఎలా పరిష్కరించవచ్చన్న దానిపై కసరత్తు చేయాలి’ అని అన్నారు.

➡️