న్యూఢిల్లీ : సిసి టివిల నిఘాలోనే 2025లో 10, 12వ తరగతి పరీక్షలను నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (సిబిఎస్‌ఇ) నిర్ణయించింది. ఈ మేరకు అనుబంధ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. 2025 ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న పరీక్షల కోసం బోర్డు ఏర్పాటు చేయనున్న కేంద్రాల్లో నిఘా కెమెరాలు తప్పనిసరి చేసినట్లు సిబిఎస్‌ఇ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలోని ఎనిమిది వేల పాఠశాలల్లోనూ, విదేశాల్లోని 26 దేశాల్లోనూ సుమారు 44 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రాసిన లేఖలో సిబిఎస్‌ఇ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సన్యాం భరద్వాజ్ కీలక సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసే అన్ని పాఠశాలలు తప్పనిసరిగా సిసి టివి పర్యవేక్షణలో ఉండాలని, వాటి కెమెరాలు అధిక రిజల్యూషన్‌తో ఉండాలని, పరీక్ష హాళ్లలోని అన్ని ప్రాంతాలను తప్పనిసరిగా కవర్ చేయాలని, రికార్డ్ చేయాలని, పుటేజీలను సురక్షితంగా భద్రపర్చాలని పేర్కొన్నారు. రికార్డ్ ఫుటేజీ సంబంధిత అధికారులు మాత్రమే చూసేందుకు వీలుంటుందని, పరీక్షా ఫలితాలు వచ్చిన రెండు నెలల వరకు ఈ ఫుటేజీ భద్రంగా ఉంటుందని తెలిపారు. ప్రతీ పది గదుల పర్యవేక్షణకు ఒక వ్యక్తిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.
