న్యూఢిల్లీ : భారత్ – చైనా సరిహద్దులను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ అనిల్ చౌహాన్ బుధవారం సందర్శించారు. ఇండియన్ ఆర్మీ సెంట్రల్ కమాండ్ పరిధిలోని మిడిల్ సెక్టార్‌లో ఆయన పర్యటించారు. దళాల సంసిద్ధతను ఆయన పరిశీలించారు. స్థానిక జవాన్లతో సంభాషించారు. పనితీరును, ఇతర ఏజెన్సీలతో సమన్వయాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చౌహాన్ అక్కడ ఓ మొక్కను నాటారు. ముందురోజే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చైనా ఎల్‌ఎసి వద్ద గ్రేజోన్ వ్యూహాలపై హెచ్చరికలు జారీ చేశారు. ఇరుదేశాల సరిహద్దుల్లో పరిస్థితులు స్థిరంగా ఉన్నా.. పరిస్థితి మాత్రం సాధారణ స్థితికి రాలేదని ఆయన పేర్కొన్నారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దౌత్యమార్గాల్లో పురోగతి ఆశాజనకంగా ఉందని.. క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పు లేదని వ్యాఖ్యానించారు.
