Wayanad : నష్టపోయిన ప్రజలకు కేంద్రం పూర్తి సహకారం అందించాలి : రాహుల్‌గాంధీ

Jul 30,2024 16:32 #Centre, #landslides, #rahul

న్యూఢిల్లీ : కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 80 మంది ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో పర్యావరణపరంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ మంగళవారం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘రెస్క్యూ రిలీఫ్‌ పనులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. ఈరోజు వాయనాడ్‌లో అనేక విధ్వంసకర కొండచరియలు విరిగిపడ్డాయి. 80 మందికి పైగా మృతి చెందారు. ముండక్కై గ్రామం తెగిపోయింది. ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా అంచనా వేయలేదు. నేను రక్షణ మంత్రితో, కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడాను. రెస్క్యూ, వైద్య సంరక్షణ కోసం సాధ్యమైన అన్నివిధాలుగా సహాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. మృతుల బంధువులకు తక్షణమే నష్టపరిహారం విడుదల చేయాలి. వీలైతే పరిహార మొత్తాన్ని పెంచొచ్చు. ముఖ్యమైన రవాణా కమ్యూనికేషన్‌ లైన్లను పునరుద్ధరించండి. వీలైనంత త్వరగా సహాయాన్ని అందజేయండి. బాధిత కుటుంబాల పునరావాసం కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయండి. మన దేశంలో గత కొన్నేళ్లుగా కొండచరియలు విరిగిపడడం ప్రమాదకరస్థాయిలో పెరిగింది. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలను మ్యాప్‌ చేయడం, ఉపశమన చర్యలు చేపట్టడం, పర్యావరణపరంగా ప్రమాదాలు తలెత్తే ప్రాంతాలలో పెరుగుతున్న విపత్తులను పరిష్కరించడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక అవసరం’ అని రాహుల్‌ అన్నారు.
కేరళలో కుండపోత వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి 80 మందికిపైగా మృతి చెందారు. ఈ ఘటనపై పార్లమెంటు ఉభయ సభలలో సభ్యులు విషాదం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది ప్రతిపక్ష సభ్యులు దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో జరిగిన ప్రాణ నష్టంపై రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ఆయన చెప్పారు. సిపిఐ(ఎం) జాన్‌ బ్రిట్టాస్‌ రక్షణ, హోం, ఆర్థిక మంత్రిత్వశాఖల సహాయాన్ని కోరారు.

➡️