NCERT: పాఠ్య పుస్తకాలలో కేంద్ర ప్రభుత్వ ప్రచారం!

 ఎన్‌సిఇఆర్‌టి ఏడో తరగతి పుస్తకంలో కేంద్ర పథకాలు
 విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారన్న విద్యావేత్తలు
న్యూఢిల్లీ : ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాలలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రచారం కన్పిస్తోంది. ఏడో తరగతికి చెందిన ఆంగ్ల పుస్తకంలో కేంద్ర పథకాలను వివరించారు. వాటిపై ప్రజలలో అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు. ప్రభుత్వ అనుకూల ప్రచారాన్ని మరింత ఉధృతంగా సాగించడానికి విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ‘పూర్వి’ పేరుతో ఉన్న పాఠ్య పుస్తకం ప్రభుత్వ డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా చర్యలను ప్రశంసలతో ముంచెత్తింది. ఈ పుస్తకానికి ఎన్‌సిఇఆర్‌టి అకడమిక్‌ కోఆర్డినేటర్‌ కీర్తి కపూర్‌ పరిచయ వాక్యాలు రాస్తూ ప్రతి ఛాప్టర్‌లోనూ అనేక కొత్త అంశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ‘లెట్‌ అజ్‌ లిజన్‌’, ‘లెట్‌ అజ్‌ ఎక్స్‌ప్లోర్‌’ వంటి వాటిని ఆయన ఉదహరిస్తూ విద్యార్థులు పాఠాలనే కాకుండా ఇతర విషయాలు కూడా తెలుసుకోవాలని సుద్దులు చెప్పారు.
‘లెట్‌ అజ్‌ ఎక్స్‌ప్లోర్‌’ అనే సెక్షన్‌లో ప్రభుత్వ పథకాలను ఏకరువు పెట్టారు. ‘బాలికల విద్య కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. బేటీ బచావ్‌ బేటీ పఢావ్‌, బాలికా సమృద్ధి యోజన, సమగ్ర శిక్షా పథకం-కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు వంటి పథకాలు ఉన్నాయి. ఇంటర్నెట్‌ నుండి కానీ మీ ఉపాధ్యాయుల నుండి కానీ అలాంటి మరిన్ని పథకాలను గురించి తెలుసుకోండి. వాటిపై మీ పొరుగువారికి అవగాహన కల్పించండి’ అని అందులో సూచించారు. మరో చోట విద్యార్థికి, అతని తల్లికి మధ్య జరిగిన సంభాషణను వివరించారు. డిజిటల్‌ ఇండియాను ఆమె ప్రశంసిస్తూ అది కంటిచూపు కరువైన వారికి ఎంతగానో ఉపయోగపడుతోందని కుమారుడికి చెప్పారు.
ఇక మరో కథలో గోశాలను సందర్శించాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు. ఉపాధ్యాయుడితో కలిసి గోశాలకు వెళ్లి అక్కడి ఆవులను ఎలా సంరక్షిస్తున్నారో పరిశీలించండని సూచించారు. ‘ది టన్నెల్‌’ అనే స్టోరీలోని ‘లెట్‌ అజ్‌ ఎక్స్‌ప్లోర్‌’ సెక్షన్‌లో జాతికి గర్వకారణమైన అటల్‌ టన్నెల్‌ 9.02 కిలోమీటర్ల పొడవు ఉన్నదని చెప్పారు. ట్రావెల్‌ అనే కవితకు చెందిన సెక్షన్‌లో మేక్‌ ఇన్‌ ఇండియాను కొనియాడారు. ఈ పుస్తకంలో ఒక లేఖ కూడా ఉంది. జాతీయ వార్‌ మెమోరియల్‌ను 2019 ఫిబ్రవరిలో నరేంద్ర మోడీ ఆవిష్కరించారని ఆ లేఖలో ఒక విద్యార్థి తన మిత్రునికి తెలియజేశాడు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలంటూ పాఠ్య పుస్తకంలో విద్యార్థులను కోరడమంటే ప్రభుత్వం తన ప్రచారం కోసం చేసిన ప్రకటన తప్ప మరోటి కాదని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ డీన్‌, ఎన్సీఈఆర్టీ ప్రాథమిక పాఠ్య పుస్తకాల అభివృద్ధి కమిటీల మాజీ ఛైర్‌పర్సన్‌ అనితా రాంపాల్‌ మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం కోసం పాఠ్య పుస్తకాలను, విద్యార్థులను వాడుకోకూడదని చెప్పారు. ఆంగ్ల పాఠ్య పుస్తకంలో గోశాల వంటి సంస్కృత పదాలను, ప్రాచీన వైద్య పద్ధతులను వాడడం అభ్యంతరకరమని అన్నారు. కాగా ఇతర పాఠ్య పుస్తకాలలోనూ ఇలాంటి ప్రచార వ్యూహమే కన్పించింది. ఉదాహరణకు ఆరో తరగతి ఆంగ్ల పుస్తకం ‘పూర్వి’లో ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ భారత్‌ కార్యక్రమం ప్రస్తావనలు ఉన్నాయి.

➡️