న్యూఢిల్లీ : చండీగఢ్ విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణను ఆపాలని సిపిఎం కోరింది. అధికంగా లాభాలనార్జిస్తున్న, సమర్ధవంతమైన రీతిలో పనిచేస్తున్న, తక్కువ టారిఫ్‌లు విధిస్తున్న ఈ విద్యుత్ సంస్థను చండీగఢ్ ప్రభుత్వం ప్రైవేటీకరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని విమర్శించింది. గత అనేక సంవత్సరాలుగా దాదాపు రూ.250 కోట్లు చొప్పున లాభాలను ఆర్జిస్తున్న అధిక విలువ కలిగిన ఈ సంస్థను సరైన మదింపు లేకుండా కేవలం రూ.174.63 కోట్లు బేస్ ధరతో అత్యంత అసంబద్ధమైన రీతిలో వేలానికి పెట్టడాన్ని పార్టీ పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. చండీగఢ్ విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వృద్ధులు, మహిళలు, పిల్లలనే తేడా లేకుండా అందరూ గత 50 రోజులుగా ఈ ప్రైవేటీకరణ చర్యకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. చండీగఢ్ ప్రజలు ప్రైవేటీకరణ వ్యతిరేక వేదికను రూపొందించారు. ఇందులో అనేక గ్రామ కమిటీలు, ప్రజా సంక్షేమ సంఘాలు, స్వతంత్ర మహిళా సంఘాలు, గురుద్వారా కమిటీలు, రైతు, యువజన సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. సంబంధిత పక్షాల మాట వినడానికి బదులుగా చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం వారిపై అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) అమలు చేసింది. నాయకత్వంపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఇక తమ పోరాటానికి చిట్టచివరి ప్రయత్నంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె నోటీసును అందజేశారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో కూడా విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు ఇలాంటి ప్రయత్నాలే చేపట్టారు. దీనివల్ల ఇంధన సార్వభౌమాధికారం, భద్రత ప్రమాదంలో పడుతుందని పొలిట్‌బ్యూరో హెచ్చరించింది. ఈ ప్రైవేటీకరణ యత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ఉద్యోగులపై చేపట్టిన అణచివేత చర్యలన్నింటినీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని, సంబంధిత పక్షాలతో అంటే విద్యుత్ ఉద్యోగులు, వినిమయదారుల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేసింది.
