విసిల నియామక నిబంధనల్లో మార్పులు

 పరిశ్రమ నిపుణులు, పిఎస్‌యుల సీనియర్లకూ అవకాశం
 ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసిన యుజిసి
న్యూఢిల్లీ : దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో వైస్‌ ఛాన్సలర్ల నియామకాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం పరిశ్రమకు చెందిన నిపుణులను, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ను నేరుగా విసిలుగా నియమించుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులు కావాలంటే ప్రొఫెసర్‌గా లేదా ప్రముఖ పరిశోధనలో లేదా అకడమిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ విభాగంలో కనీసం పది సంవత్సరాల పాటు పని చేసి ఉండాలి. అయితే ఇప్పుడు తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పరిశ్రమలో, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో, ప్రభుత్వ విధానాలలో లేదా కనీసం ప్రభుత్వ రంగ సంస్థలో కనీసం పది సంవత్సరాల సీనియర్‌ స్థాయి అనుభవం గడించి ఉంటే సరిపోతుంది. ముసాయిదా మార్గదర్శకాలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విడుదల చేశారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకానికి సంబంధించిన నిబంధనలకు కూడా ఆయన అందులో సవరణలు ప్రతిపాదించారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీలు ఏ సబ్జెక్టులో పొందినప్పటికీ యుజిసి-నెట్‌లో మంచి పనితీరు కనబరచిన సబ్జెక్టులో అధ్యాపకులుగా నియమితులు కావడానికి అర్హత పొందుతారు. దీనిపై యుజిసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ మామిడాల జగదీష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇది చాలా ముఖ్యమైన వెసులుబాటు అని చెప్పారు. సూచనల కోసం నూతన మార్గదర్శకాలను యుజిసి వెబ్‌సైటులో ఉంచారు. కనీసం 55 శాతం మార్కులతో ఎంఇ లేదా ఎంటెక్‌ ఉత్తీర్ణులైన వారిని యుజిసి-నెట్‌లో అర్హత సాధించకపోయినా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నేరుగా నియమించుకోవచ్చు. ఏ సబ్జెక్టులో అయితే అధిక విద్యార్హత కలిగి ఉంటారో ఆ సబ్జెక్టునే బోధించే వెసులుబాటు కూడా ఉంటుంది. అంటే మాథమెటిక్స్‌లో బ్యాచిలర్‌, ఫిజిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీలు ఉండి కెమిస్ట్రీలో పిహెచ్‌డి చేసి ఉంటే కెమిస్ట్రీలోనే బోధించవచ్చు. దీనివల్ల వివిధ నేపథ్యాల నుండి వచ్చిన వారిని ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుందని జగదీష్‌ కుమార్‌ తెలిపారు. కాగా నూతన మార్గదర్శకాలు కేంద్ర, రాష్ట్ర, ప్రయివేటు, డీమ్డ్‌ యూనివర్సిటీలకు వర్తిస్తాయి.

ప్రయివేటీకరణ కోసమే ఈ ముసాయిదా : ఎస్‌ఎఫ్‌ఐ
యుజిసి ముసాయిదాను ఎస్‌ఎఫ్‌ఐ తిరస్కరించింది. యూనివర్శిటీలను కేంద్రీకరించడానికి, ప్రయివేటీకరణకు మరో ప్రయత్నంగా ఈ ముసాయిదాను విమర్శించింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉన్నత విద్యను రక్షించడానికి ముందుకు రావాలని విద్యావేత్తలను కోరింది. అలాగే ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలపాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాల్లో వైస్‌ ఛాన్సలర్ల నియామకాల విషయంలో గవర్నర్ల జోక్యం పెరుగుతోందని, కేంద్రం కనుసన్నల్లో బిజెపి ఏజెంట్‌లా వ్యవహిరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోందని పేర్కొంది. తాజా ముసాయిదాలో వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్లకు ఎక్కువ అధికారాలను కట్టబెట్టారని, రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకు ఇలాంటి ప్రతిపాదనలు చేశారని ఎస్‌ఎఫ్‌ఐ విమర్శించింది. అలాగే ముసాయిదా నిబంధనలను పరిశీలించడానికి మొదటిసారిగా పారిశ్రామిక వేత్తలను అనుమతించడం విద్యా రంగంలో కార్పొరేట్‌ సంస్కృతిని చొప్పించే ప్రయత్నంగా పేర్కొంది. అలాగే ఉపాధ్యాయులకు నిర్ధిష్ట బోధన సమయం ప్రస్తావించలేదని, ఇది ఉపాధ్యాయులపై పనిభారం పెంచడానికి, ఉద్యోగాలను తగ్గించడానికి ఒక ప్రమాదకరమైన వ్యూహంగా ఎస్‌ఎఫ్‌ఐ విమర్శించింది.

➡️