ముంబయి : మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఇటీవల ప్రధాని అట్టహాసంగా ప్రారంభించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం సోమవారం కుప్పకూలింది. గతేడాది డిసెంబర్ 4న ప్రధాని ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ ఘటనపై బిఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కాంట్రాక్టర్ జయదీప్ ఆప్టే మరియు నిర్మాణ సలహాదారు చేతన్ పాటిల్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కుట్ర, మోసం, ప్రజాభద్రతకు హానీ కలిగించడం వంటి సెక్షన్లను నమోదు చేశారు. విగ్రహ నిర్మాణంలో వినియోగించిన స్టీల్ నాణ్యత తక్కువగా ఉందని, నట్‌లు, బోల్ట్‌లు తుప్పు పట్టినట్లు తేలినట్లు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) పేర్కొంది. ప్రారంభించిన ఎనిమిది నెలల్లోపే విగ్రహం క్షీణస్థితికి చేరుకోవడంపై స్థానికులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 20న పిడబ్ల్యుడి మల్వాన్ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ హెచ్చరికలు కూడా చేశారు. నట్లు, బోల్టులు తుప్పు పట్టడంతో విగ్రహం దెబ్బతినే పరిస్థితి ఉందని అన్నారు. అయినప్పటికీ కాంట్రాక్టర్లు పట్టించుకోలేదని అన్నారు. విగ్రహ నిర్మాణానికి వినియోగించిన స్టీల్ తుప్పు పట్టడం ప్రారంభించిందని, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేవీ అధికారులకు లిఖితపూర్వక నివేదిక సమర్పించినట్లు సింధుదుర్గ్ మంత్రి రవీంద్ర చవాన్ పేర్కొన్నారు.
విగ్రహ నిర్మాణంలో ఎటువంటి నైపుణ్యంలేని నేవీ విగ్రహాన్ని మరియు దాని పీఠాన్ని ప్రతిష్టించే పనిని సెప్టెంబర్ 8న ప్రారంభించింది. డిసెంబర్ 4న నేవీ డే రోజున రాజ్‌కోట్‌లో విగ్రహాన్ని ఆవిష్కరించారు. బలమైన గాలుల కారణంగా విగ్రహం కూలిపోయిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు. విగ్రహం కూలిపోయిన సమయంలో గంటకు 45 కి.మీ వేగంతో గాలులు వీచాయని అన్నారు. అయితే ఆప్రాంతంలో వాతావరణ పరిస్థితులను అంచనావేయకుండా విగ్రహాన్ని ఎలా ప్రతిష్టించారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.
