రాయ్ పూర్ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్‌తోపాటు, అతని కుమారుడు చైతన్య బాఘేల్ నివాసాల్లో సోమవారం ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు సోదాలు నిర్వహించారు. భూపేష్ బాఘేల్ సిఎంగా ఉన్న సమయంలో.. ఛత్తీస్‌గఢ్‌లో మద్యం వ్యాపారంలో అక్రమలు జరిగాయని, అక్రమ కమిషన్లు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించిన కేసులో ఆ రాష్ట్రంలో 14 చోట్ల ఇడి సోదాలు నిర్వహించింది. ఈ లిక్కర్ స్కామ్‌లో భూపేష్ బాఘేల్ కుమారుడు చైతన్య బాఘేల్ కోట్లాది రూపాయల్ని స్వాహా చేసినట్లు ఇడి ఆరోపించింది. అయితే ఇడి దాడులపై భూపేష్ బాఘేల్ కార్యాలయం స్పందించింది. ‘లిక్కర్ స్కామ్ అన్నదే తప్పుడు కేసు. ఏడేళ్ల క్రితమే ఈ కేసును కోర్టు కొట్టేసింది. అయితే ఈ కేసులో ఈరోజు ఇడి అతిథులు మాజీ సిఎం భూపేష్ బాఘేల్ భిలారులోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారు. ఈ కుట్ర ద్వారా పంజాబ్‌లో కాంగ్రెస్‌ను ఆపడానికి ఎవరైనా ప్రయత్నిస్తే.. అది తప్పే అవుతుంది’ అని భూపేష్ బాఘెల్ కార్యాలయం ఎక్స్ పోస్టులో పేర్కొంది.
కాగా, 2019-2022 మధ్య చత్తీస్‌గఢ్‌లో మద్యం పథకం ద్వారా ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, మద్యం వ్యాపారులు అక్రమంగా 2,161 కోట్లు వసూలు చేశారని ఇడి ఆరోపించింది. ప్రభుత్వ దుకాణాల ద్వారా కాకుండా.. అక్రమ అమ్మకం కోసం సరఫరాదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఇడి ఆరోపించింది. మద్యం వ్యాపారంలో అక్రమాలు జరిగాయని గుర్తించి ఆదాయపు పన్ను శాఖ నివేదిక ఆధారంగా ఈ దర్యాప్తు జరిగింది. ఈ కేసులో ఐఎఎస్ అధికారి అనిల్ తుటేజా, రారుపూర్ మేయర్ సోదరుడు, మద్యం వ్యాపారి అన్వర్ ధేబర్‌తో సహా పలువురు కీలక నిందితులను ఇడి అరెస్టు చేసింది.
