కేరళలో ‘చికెన్‌ ఆన్‌ వీల్‌ ‘

Dec 11,2024 23:36 #Chicken on Wheels, #in Kerala
  • అందుబాటు ధరల్లో ఆరోగ్యకర మాంసాహారం
  • కుడుంబశ్రీ మరో వినూత్న ప్రాజెక్టు ఆవిష్కరించిన వామపక్ష ప్రభుత్వం

తిరువనంతపురం : ప్రజలే ముందు విధానాలతో వినూత్న పథకాలను ఆవిష్కరిస్తున్న కేరళలోని వామపక్ష ప్రభుత్వం తాజాగా ‘చికెన్‌ ఆన్‌ వీల్‌’ పేరుతో సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. స్వయం సహాయక సంఘాలతో ఏర్పడిన ‘కుడుంబశ్రీ’ ద్వారానే ఈ ప్రాజెక్టును కూడా అమల్జేయనున్నారు. ఈ పథకం కింద తాజా కోడి మాంసం, గుడ్లు, తదితర ఉత్పత్తులతో పాటు శీతలీకరించిన విలువ ఆధారిత చికెన్‌ ఉత్పత్తులు (చికెన్‌ డ్రమ్‌ స్టిక్స్‌, బోన్‌ లెస్‌ బ్రెస్ట్‌, చికెన్‌ బిర్యానీ కట్‌, చికెన్‌ కర్రీ కట్‌, ఫుల్‌ చికెన్‌ వంటివి) ప్రజల వద్దకే ప్రత్యేక వాహనాలు ద్వారా విక్రయించనున్నారు. మార్కెట్‌లోకి తీసుకురానున్న శీతలీకరణ మాంసాహార ఉత్పత్తులను కేరళ స్థానిక సంస్థల శాఖ మంత్రి రాజేష్‌ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నుంచి తాము ‘కేరళ చికెన్‌’ ప్రాజెక్టు ద్వారా ఆరోగ్యకరమైన మాంసాహారాన్ని, గుడ్లను కుడంబశ్రీ ద్వారా ప్రజలకు అందుబాటు ధరలకే అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ‘చికెన్‌ ఆన్‌ వీల్‌’ పేరుతో తాజా మాంసాహారాన్ని, గుడ్లను, ఫ్రోజెన్‌ ఉత్పత్తులను ప్రత్యేక వాహనాల ద్వారా ప్రజల చెంతకే తీసుకెళ్లే పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ పథకం కింద కుడుంబశ్రీ సభ్యులు నేరుగా పౌల్ట్రీ రైతుల వద్దకు వెళ్లి కోళ్లను, గుడ్లను సేకరిస్తారని, వాటిని కుతత్తుకులంలోని భారత మాంసాహార ఉత్పత్తుల సంస్థకు చేర్చి అక్కడ ప్రాసెస్‌ చేసి నేరుగా వినియోగదారులకు చేరవేస్తారని తెలిపారు. అన్ని మాంసాహార ఉత్పత్తులపై క్యుఆర్‌ కోడ్‌ ఉంటుందని, దీనివల్ల ఏ ఉత్పత్తి ఏ పౌల్ట్రీ నుంచి వచ్చిందన్న సంగతి కూడా వినియోగదారులు తెలుసుకోవచ్చునని, దీనివల్ల తాము ఆరోగ్యకరమైన మాంసాన్ని స్వీకరిస్తున్నామన్న భరోసా ప్రజలకు లభిస్తుందని తెలిపారు. తొలి దశలో త్రిసూర్‌, ఎర్నాకులం, కొట్టాయం, పథమిట్ట జిల్లాల్లో వీటిని విక్రయించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు పి గౌరి, సతీదేవి తదితరులు పాల్గొన్నారు. 2019లో ప్రారంభించిన ‘కేరళ చికెన్‌’ ప్రాజెక్టు కింద ఇప్పటికే 431 బ్రాయిలర్‌ కోళ్ల పెంపకం కేంద్రాలను నెలకొల్పారు. 11 జిల్లాల్లో 139 అవుట్‌ లెట్లు పనిచేస్తున్నాయి.

➡️