ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన బర్త్‌ డే కేక్‌ తిని చిన్నారి మృతి…!

పటియాలా (పంజాబ్‌) : ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన కేక్‌ తినడంతో పదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

పోలీసుల కథనం మేరకు … పంజాబ్‌లోని పటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి ఈ నెల 24న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఓ బ్యాకరీ నుంచి ఆన్‌లైన్‌లో కేక్‌ ఆర్డర్‌ చేశారు. సాయంత్రం 7 గంటలకు కేక్‌ కట్‌ చేసి.. కుటుంబ సభ్యులంతా తిన్నారు. రాత్రి 10 గంటలకల్లా అందరూ అస్వస్థతకు గురయ్యారు. గొంతు తడారిపోతోందంటూ మాన్వి మంచినీళ్లు తాగి నిద్రలోకి జారుకుంది. ఉదయానికి కల్లా ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ చిన్నారి ప్రాణాలను కాపాడలేకపోయారు. కేకు విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బేకరీ యజమానిపై ఫిర్యాదు చేశారు. మఅతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు, కేక్‌ నమూనాలను కూడా సేకరించి పరీక్షల కోసం పంపారు. నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

➡️