న్యూఢిల్లీ : వాటర్ ట్రీట్‌మెంట్ కోసం చైనా, జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న రసాయనంపై భారత ప్రభుత్వం డంపింగ్ నిరోధక సుంకాన్ని విధించింది. దీని కింద రాబోయే ఐదు సంవత్సరాల పాటు టన్నుకు 986 డాలర్ల సుంకాన్ని వసూలు చేస్తారు. చైనా, జపాన్ నుంచి తక్కువ ధరకే రసాయనం లభిస్తుండడంతో దేశీయ పరిశ్రమ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని, ఈ నేపథ్యంలో చౌక దిగుమతుల నుంచి దేశీయ పరిశ్రమకు రక్షణ కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది. ‘ట్రిక్లోరో ఐసోసియాన్యూరిక్ యాసిడ్’ అనే ఈ రసాయనంపై సుంకాన్ని విధించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన దర్యాప్తు విభాగం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) చేసిన సిఫారసుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చైనా, జపాన్ నుంచి పెద్ద ఎత్తున రసాయనం భారత్‌కు చేరుతోందని, దీనివల్ల దేశీయ పరిశ్రమ వద్ద దాని నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయని డిజిటిఆర్ తెలిపింది. ఈ రెండు దేశాలు భారత్‌కు కీలక వాణిజ్య భాగస్వాములు. సుంకం విధించాలని డిజిటిఆర్ సిఫారసు చేసిన మూడు నెలల్లోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ దాని అమలుపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
