వినియోగదారుల కోర్టుల్లో లాయర్లపై దావాలు చెల్లవు

May 14,2024 23:58 #supreem court
  •  సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
  •  2007 నాటి ఫోరం తీర్పు కొట్టివేత

న్యూఢిల్లీ : సేవల్లో లోపాన్ని ఎత్తిచూపుతూ న్యాయవాదులపై వినియోగదారుల కోర్టుల్లో దావాలు వేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లాయర్లు ఫీజు తీసుకుని కేసులు వాదిస్తుంటారని, దాన్ని వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ‘సేవ’గా పరిగణించలేమని తేల్చి చెప్పింది.సేవల్లో లోపాన్ని ఎత్తిచూపుతూ న్యాయవాదులపై వినియోగదారుల న్యాయస్థానాల (కన్జ్యూమర్‌ కోర్టు)ల్లో దావాలు వేయకూడదని జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిథాల్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది.

ఆ తీర్పు చెల్లదు!
న్యాయవాదులపై కన్జ్యూమర్‌ కోర్టుల్లో దావాలు వేయొచ్చంటూ 2007 సంవత్సరంలో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. న్యాయవాదులు అందించే సేవలు వినియోగదారుల రక్షణ చట్టం 1986లోని సెక్షన్‌ 2 (ఓ) పరిధిలోకి వస్తాయని అప్పట్లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ పేర్కొంది. అయితే ‘ కమిషన్‌ తీర్పు వ్యాపారం, వాణిజ్యం నుంచి వృత్తిని వేరు చేసింది. ఒక ప్రొఫెషనల్‌కు ఉన్నత స్థాయి విద్య, నైపుణ్యం, మానసిక శ్రమ అవసరం. వృత్తి నిపుణుడి విజయం వారి నియంత్రణలో లేని వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం, వ్యాపారవేత్తలతో సమానంగా వృత్తి నిపుణులను చూడలేమని స్పష్టం చేసింది. ‘వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం, వైద్యులను కూడా బాధ్యులను చేయొచ్చని గతంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ విపి శాంతన కేసులో తీర్పు వెల్లడయింది. దాన్ని పున్ణసమీక్షించాల్సిన అవసరం ఉంది’ అని జస్టిస్‌ త్రివేది తెలిపారు.

➡️