గువహటి : అస్సాంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటన నేపథ్యంలో కోచ్-రాజ్‌బోంగ్షీలు ఎస్‌టి హోదా డిమాండును తిరిగి లేవనెత్తాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా అమిత్‌షా మార్చి 14న అస్సాం చేరుకోనున్నారు. పశ్చిమ అస్సాం, ఉత్తర పశ్చిమబెంగాల్ ప్రాంతాలలో నివసించే అతిపెద్ద ఆరు ప్రాచీన తెగలలో ఒకటైన కోచ్-రాజ్‌బోంగ్షీలు దశాబ్దాలుగా ఎస్‌టి హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివాసీలు, అహోంలు, చుటియాలు, మటాక్స్, మారన్‌లు మిగిలిన తెగలు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ సైకియాకు శనివారం వినతిపత్రాన్ని సమర్పించామని మంచా ప్రతినిధి ఒకరు తెలిపారు. 2025 ఏప్రిల్ 30 నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బిజెపికి అల్టిమేటం జారీ చేసినట్లు తెలిపారు. గతంలో మాదిరిగా 2026 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల హామీల పేరుతో తమను మోసం చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. మంచా అనేది కోచ్-రాజ్‌బోంగ్షీ తెగకు చెందిన 12 సంస్థలతో కూడిన ప్రధాన సంస్థ. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎస్‌టి హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి ఆరు తెగలకు ఎస్‌టి హోదాను కల్పించినప్పటికీ.. తమ తెగను పక్కన పెట్టినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
