కోడ్‌ ఉల్లంఘించారు

May 17,2024 00:39 #EC
  •  విసిల నియామకాలపై ఇసికి నీలోత్పల్‌ బసు లేఖ

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్‌ అమల్లో వుండగా జరిగిన వైస్‌ ఛాన్సలర్ల నియామకాలను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు నీలోత్పల్‌ బసు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు లేఖ రాశారు. ఓట్ల లెక్కింపు జరగడానికి మూడు వారాలు ముందుగా, ఎన్నికల నిబంధనావళి అమల్లో వున్నప్పుడు సెంట్రల్‌ యూనివర్శిటీలకు వైస్‌ ఛాన్సలర్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తోంది. శ్రీపెరంబదూర్‌లోని రాజీవ్‌గాంధీ జాతీయ యువజనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నియమించింది. ఏప్రిల్‌ 30న ఆయనను నియమించారు. తిరిగి ఈ నెల 17న పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ పదవికి ఇంటర్వ్యూ కూడా నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో వుండగా ఇంత హడావిడిగా పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌, ఇతర సెంట్రల్‌ యూనివర్శిటీలు, కేంద్ర నిధులతో నడిచే ఉన్నత విద్యాసంస్థలకు నియామకాలను ప్రభుత్వం చేపట్టడంలో ఔచిత్యమేమిటి? ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం కలిగిన విద్యావేత్తలను నియమించాలన్నదే వారి ప్రయత్నంగా కనిపిస్తోందని నీలోత్పల్‌బసు ఆ లేఖలో విమర్శించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు జరిగేలా చూసేందుకు, ఈ నియామకాలన్నీ రద్దయ్యేలా భారత ఎన్నికల కమిషన్‌ తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు.

➡️