Uttar Pradesh: రైల్వే స్టేషన్‌లో కూలిన పైకప్పు

  • శిథిలాల్లో 23 మంది నిర్మాణ కార్మికులు

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్నౌజ్‌ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న శ్లాబు శనివారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో 23 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. కన్నౌజ్‌ రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఓ భవనంలో నిర్మాణ పనులు సాగుతుండగానే.. శనివారం మధ్యాహ్నం రెండో అంతస్తులో శ్లాబు (పైకప్పు) ఒక్కసారిగా కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిలో ఆరుగురు కార్మికులను సహాయక సిబ్బంది వెలికితీశారు. తీవ్ర గాయాలవ్వడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. మిగిలినవారిని వెలికి తీసేందుకు పెద్ద ఎత్తన సహాయక ఆపరేషన్‌ చేపట్టారు. అయితే ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలను అధికారులు వెల్లడించలేదు.

➡️