ఓరియంటేషన్‌ కార్యక్రమం ప్రారంభానికి రండి

Nov 28,2024 00:16 #Om Birla, #orientation program
  • లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు అయ్యన్నపాత్రుడు, రఘురామ ఆహ్వానం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు నిర్వహించే ఓరియంటేషన్‌ కార్యక్రమ ప్రారంభానికి రావాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు ఆహ్వానించారు. బుధవారం నాడిక్కడ పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్‌ను అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు త్వరలో నిర్వహించనున్న ఓరియంటేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరారు. దీనికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అంగీకరించారు. లోక్‌సభ సెక్రటేరియట్‌ ప్రతిపాదిత ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌కు అవసరమైన సహాయాన్ని అందించింది. అనంతరం మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డి దేవగౌడను కలిశారు.

పివి సునీల్‌పై చర్యలేవీ : డిప్యూటీ స్పీకర్‌

తన కేసులో అసలు సూత్రధారి పివి సునీల్‌ కుమార్‌ పై చర్యలు ఏవి అని ఎపి డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. బుధవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ పివి సునీల్‌ కుమార్‌ ప్రధాన నిందితుడని, ఆయన తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వారని అన్నారు. పివి సునీల్‌ కుమార్‌కి లుక్‌ ఔట్‌ నోటీసులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పివి సునీల్‌ కుమార్‌ దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులపై ఉందన్నారు. సునీల్‌ కుమార్‌, విజరు పాల్‌ అంతా ఒక ముఠా అని అన్నారు. తనను టార్చర్‌ చేసిన వారికి న్యాయస్థానంలో తప్పకుండా శిక్ష పడుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

➡️