కొచ్చి : మహిళల శరీర శౌష్టవంపై ఎటువంటి కామెంట్ చేసినా.. అది లైంగిక వేధింపే అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది. జస్టిస్ ఏ బదరుద్దీన్ జనవరి 6వ తేదీన ఈ తీర్పును ఇచ్చారు. కేరళ విద్యుత్తు శాఖకు చెందిన ఓ మహిళా ఉద్యోగినిపై మరో ఉద్యోగి కామెంట్ చేశారు. దీంతో ఆమె లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ.. ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. అయితే నిందితుడిపై సరైన ఆధారాలున్నాయని కేసును కొట్టివేయడం జరగదని హైకోర్టు తేల్చి చెప్పింది.
కాగా, 2013 నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అసభ్యకరమైన భాషను వాడారని, 2017లో అభ్యంతకరమైన మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ చేసేవాడని ఆ మహిళా ఉద్యోగి ఆరోపించింది. ఈ విషయంపై తాను పనిచేస్తున్న విద్యుత్ శాఖకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీలోని సెక్షన్ 354ఏ(లైంగిక వేధింపులు), 509(మహిళను కించపరచడం), సెక్షన్120(ఓ) కింద కేసు నమోదు చేశారు. కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్ 120(ఓ) కింద కూడా ఆ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కోర్టు పేర్కొన్నది. అయితే కేవలం శరీర శౌష్టవం బాగుందని కామెంట్ చేసినంత మాత్రాన.. తనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారని, ఆకేసును కొట్టివేయాలని ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. అయితే ఐపీసీలోని సెక్షన్ 354ఏ, 509తో పాటు సెక్షన్ 120 కేరళ పోలీసు చట్టం ప్రకారం నిందితుడిపై తగిన ఆధారాలు ఉన్నాయని, మహిళ శరీర నిర్మాణంపై ఎలాంటి కామెంట్ చేసినా తప్పేనని హైకోర్టు పేర్కొంది.