పంజాబ్‌, హర్యానాల్లో అన్నదాతల ఆందోళనలు

Mar 22,2025 00:25 #AIKS, #Farmers Protest, #Haryana

హర్యానా సిఎం షైనీ నివాసానికి భారీ ర్యాలీ
చండీగఢ్‌ : శంభు, కన్నౌరి సరిహద్దుల్లో రైతులను బలవంతంగా ఖాళీ చేయించి, శిబిరాలను తొలగించడం, రైతు నాయకులు అరెస్టు చేయడంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం పంజాబ్‌, హర్యానాల్లో అన్నదాతలు నిరసనలతో కదం తొక్కారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్‌ సింగ్‌ షైని నివాసానికి అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌), భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) ఆధ్వర్యాన రైతులు ర్యాలీ నిర్వహించారు. కురుక్షేత్రలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీస్‌కు జాయింట్‌ కిసాన్‌ మోర్చా హర్యానా నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గన్నారు. రుణమాఫీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత వంటి డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. రైతు నాయకుల అరెస్టులను ఖండించారు. వ్యవసాయ వాణిజ్య విధానాన్ని రద్దు చేయాలని, స్మార్ట్‌ మీటర్ల ప్రణాళికను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. బీమా క్లెయిమ్‌లు, పంట పరిహారం, గడ్డి నిర్వహణ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన భూగర్భ చమురు పైప్‌లైన్‌, హెచ్‌టి విద్యుత్‌ లైన్‌, మొబైల్‌ టవర్లకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరారు. గోధుమలతో సహా అన్ని రబీ పంటలకు బోనస్‌ ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్లకు సిపిఎం హర్యానా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
శుక్రవారం పంజాబ్‌, హర్యానాలోని డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల ఎదుట రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బికెయు నాయకులు రాకేష్‌ తికాయత్‌, కాంగ్రెస్‌ ఎంపి చరణ్‌జీత్‌ సింగ్‌, ఎస్‌ఎడి నాయకులు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, రెజ్లర్‌ బజరంగ్‌ పునియా తదితర ప్రముఖులు ఈ నిరసనల్లో పాల్గన్నారు. అరెస్టు చేసిన రైతు నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పారిశ్రామిక వేత్తలకు రూ 16 లక్ష కోట్లు రుణమాఫీ చేసిన మోడీ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ మాత్రం భారంగా భావిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపి ధర్మేంద్ర యాదవ్‌ విమర్శించారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో కూడా రైతులు ఆందోళనలకు దిగారు. కావేరీ రైల్వే వంతెనపై రైల్‌ రోకో కార్యక్రమం నిర్వహించారు.
బుధవారం అరెస్టు చేసి రెస్ట్‌హౌస్‌కు తరలించిన రైతు నాయకులు జగ్జీత్‌ దల్లేవాల్‌ అప్పటి నుంచి కనీసం మంచినీరు కూడా తీసుకోవడం లేదని సమాచారం.

స్పందించని కేంద్రం
పంజాబ్‌, హర్యానాలో రైతులు తీవ్రంగా నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గంటున్నా.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పందించడం లేదు. రైతు నాయకులతో తక్షణం చర్చలు జరపడానికి ముందుకు రావడం లేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం రైతు నాయకులతో తదుపరి చర్చలు మే 4నే నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు శుక్రవారం తెలిపారు. రైతు నాయకులను పంజాబ్‌ పోలీసులు అరెస్టుచేయడం తాత్కాలికమని, వారు తరువాత విడుదలవుతారని చెప్పారు.

➡️