- ప్రతిపక్షాల ఆందోళన, వాకౌట్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మూడో రోజు ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు ప్రారంభమ య్యాయి. సోమవారం సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపిలు మహా కుంభమేళా విషాదంపై లోక్‌సభలో చర్చకు పట్టుబట్టారు. ప్రతిపక్ష సభ్యులు, ప్రశ్నోత్తరాలను సస్పెండ్ చేసి, గత నెల 29న ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే తొక్కిసలాటలో మరణించిన వారి పూర్తి జాబితాను విడుదల చేయాలని నినదించారు. అనంతరం సభ్యులు సభలోని వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. విపక్షాల ఆందోళనపై స్పీకర్ ఓంబిర్లా అసహనం వ్యక్తం చేశారు. ”ప్రజలు మిమ్మల్ని ఎంపిలుగా ఎన్నుకున్నది. నినాదాలు చేయడం, సభా కార్యకలాపాలకు భంగం కలిగించడం, బల్లలు పగలగొట్టేందుకా?” అని మండి పడ్డారు. అయినా ప్రతిపక్ష ఎంపిలు ‘తానాషాహీ నహీ చలేగీ’ అని నినాదాలతో హోరెత్తించారు. ప్రతిపక్ష ఎంపిలు ప్రశ్నలు లేవనెత్తడానికి కూడా స్పీకర్ అవకాశం ఇవ్వాలన్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష ఎంపిలకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ ”దయచేసి ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం కలిగించకండి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రతి ఎంపి తమ అభిప్రాయం చెప్పేందుకు అవకాశం ఇస్తాం’ అని అన్నారు. గందరగోళం మధ్యే లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ప్రశ్నోత్తరలు ముగిసిన తరువాత కాంగ్రెస్, డిఎంకె, టిఎంసి, ఎస్‌పి సహా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.
రాజ్యసభ లోనూ..
రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. సోమవారం ఇటీవల మరణించిన ఎంపిలకు నివాళులర్పిస్తూ రాజ్యసభ ప్రారంభమైంది. అయితే మహాకుంభ మేళ ఘటనపై ప్రతిపక్షాలు నినాదలు చేశాయి. గత పార్లమెంట్ సమావేశంలో కేంద్ర హౌం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ పట్ల పెరుగుతున్న అగౌరవ సంఘటనలపై చర్చించడానికి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపి రణదీప్ సింగ్ సూర్జేవాలా సోమవారం మోషన్ నోటీసును సమర్పించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక న్యాయం, సమానత్వ సూత్రాలను అణగదొక్కేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతోందని తన నోటీసులో పేర్కొన్నారు. అయితే జీవో అవర్ ప్రారంభించే ముందు ధన్ ఖర్ మాట్లాడుతూ, రూల్ 267 కింద తొమ్మిది నోటీసులు వచ్చాయని, అయితే ఈ నోటీసులు మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని, వాటిని తిరస్కరిస్తున్నట్లు ధనకర్ తెలిపారు. అనంతరం మహాకుంభ్ తొక్కిసలాట ఘటనపై యుపిలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపిలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
సోనియా గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
కాంగ్రెస్ ఎంపి సోనియా గాంధీపై బిజెపి ఎంపిలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై అభ్యంతరకర పదాలు వాడారని ఎంపిలు విమర్శించారు. సోనియా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రపతి గౌరవానికి భంగం వాటిల్లేవేనని అందులో పేర్కొన్నారు. ‘సోనియా గాంధీ వాడిన పదాలు రాష్ట్రపతి స్థాయి, గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. అటువంటి వ్యాఖ్యలు పార్లమెంటు సమావేశాల పవిత్రతను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాం’ అని ఎంపిలు పేర్కొన్నారు. ఈ అంశానికి ఉన్న తీవ్రత దృష్ట్యా.. వీటిని పరిగణనలోకి తీసుకొని సోనియా గాంధీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు.