న్యూఢిల్లీ : మణిపూర్ సంక్షోభంపై ప్రధాని మోడీ మౌనం వీడాలని, అక్కడి పరిస్థితులపై ఆయన దృష్టిసారించాలని డిమాండ్ చేస్తూ.. ప్రతిపక్షనేతలు పార్లమెంటు వెలుపల జంతర్‌మంతర్ వద్ద నిరసన చేశారు. పార్లమెంటులో మణిపూర్ హింసపై చర్చ జరగాలని కాంగ్రెస్, సిపిఐ డిమాండ్ చేశాయి. కాగా, ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపి జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మణిపూర్‌లో హింస చెలరేగి దాదాపు 18 నెలలు అవుతోంది. యావత్ ప్రపంచాన్ని చుట్టివచ్చే మన ప్రధాని మోడీ.. ఇప్పటివరకు మన దేశంలోని మణిపూర్‌ని మాత్రం సందర్శించలేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ అక్కడ శాంతిని నెలకొల్పడంలో విఫలమయ్యారు. దీనికి బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. ఈ విషయంపై ప్రధాని మోడీ మౌనం వీడాలి. మోడీ మణిపూర్‌కి వెళ్లాలి. ఈ డిమాండ్ చేస్తున్నది మేము కాదు.. ప్రజలే’ అని ఆయన అన్నారు.
ఇక ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో సిపిఐ నేత డి. రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రధాని మోడీ కానీ, బిజెపి కానీ ఎప్పుడూ ముందుగా దేశం గురించే మాట్లాడతారు. అయితే దేశం గురించి మాట్లాడేవారికి సాధారణమైన ప్రశ్న. అదేమిటంటే.. మణిపూర్ దేశంలో భాగం కాదా? మణిపూర్ గురించి ప్రధాని మోడీ ఒక్కమాట కూడా మాట్లాడడం లేదు ఎందుకు? మణిపూర్ అంశంపై పార్లమెంటులో ప్రభుత్వం ఎందుకు చర్చ పెట్టనివ్వడం లేదు? ఇప్పటికీ మణిపూర్ గందరగోళంలో కొనసాగుతుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ రాజకీయ పరిష్కారం లేదు. మణిపూర్ సిఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని ఆయన అన్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో ఎంపీలు అదానీ వ్యవహారంపై చర్చకు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చర్చ పెట్టనివ్వడంలేదు. దీంతో సోమవారం కూడా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు వెలుపల ఆందోళన చేశారు.