Congress: సూరత్ లోక్‌సభ సీటు ఏకగ్రీవం వెనుక మ్యాచ్‌ ఫిక్సింగ్‌

న్యూఢిల్లీ :  గుజరాత్‌ లోని సూరత్‌ లోక్‌సభ స్థానంలో బిజెపి అభ్యర్థి ముఖేష్‌ దలాల్‌ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు బిజెపి ప్రకటించడంపై కాంగ్రెస్‌ మండిపడింది. గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ సీటు ఎన్నికలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగినట్లు కాంగ్రెస్‌ పార్టీ సోమవారం పేర్కొంది.  పేపర్లలో తేడాలు ఉన్నాయంటూ తమ అభ్యర్థి నీలేష్‌ కుంభనీతో పాటు ప్రత్యామ్నాయ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను జిల్లా రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారని  ఆగ్రహం వ్యక్తం చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్క రోజు ముందు జిల్లా అధికారి వారి పత్రాలను తిరస్కరించారని మండిపడింది. పార్టీ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్‌ న్యాయవాది బాబు మంగూకియా తెలిపారు.బిఎస్‌పి అభ్యర్థి ప్యారేలాల్‌ భార్తి సహా ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ల చివరి రోజైన సోమవారం తమ పత్రాలను ఉపసంహరించుకోవడం గమనార్హం.

తమ పార్టీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు గుజరాత్‌ బిజెపి యూనిట్‌ చీఫ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సహా ఇతర అభ్యర్థులందరూ తమ నామినేషన్‌లను ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి వుంది.

నీలేష్‌ కుంభనీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌ఒ పేర్కొన్నారు.

➡️