సిఎఎపై కాంగ్రెస్‌ మౌనం

  •  పినరయి విజయన్‌ విమర్శ

తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై కాంగ్రెస్‌ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో మౌనం వహించడాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. బిజెపి, సంఘపరివార్‌ ఆలోచనా తీరుకు కాంగ్రెస్‌ వైఖరి ఊతమిచ్చేదిగా ఉందన్నారు. సిఎఎను వ్యతిరేకిస్తూ వామపక్ష సంఘటనతో తొలుత చేతులు కలిపిన కాంగ్రెస్‌ కేరళ శాఖ తర్వాత జాతీయ నాయకత్వ ఆదేశాల మేరకు వెనకడుగు వేసిందని విజయన్‌ విమర్శించారు. అట్టింగాళ్‌లో సిపిఎం అభ్యర్ధి వి.జారుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సిఎఎపై కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీ మౌనం పాటిస్తున్నారని, ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా దీనిపై ఏమీ మాట్లాడలేదని అన్నారు. అమెరికాతో సహా పలు దేశాలు సిఎఎను విమర్శిస్తూ వ్యతిరేకిస్తుండగా, కాంగ్రెస్‌ మాత్రం దీనిపై ఒక వైఖరి తీసుకోలేకపోతోందని విమర్శించారు. మాజీ మంత్రి, సిపిఐ(ఎం) అభ్యర్థి థామస్‌ ఇజాక్‌ను కెఐఐఎఫ్‌బి మసాలా బాండ్‌ కేసులో ఎందుకు ఇడి అరెస్టు చేయలేదని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోందన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యుడిఎఫ్‌ ఎంపీలకు ఎవరైతే ఓటు వేశారో వారు ఇప్పుడు నిరాశ చెందుతున్నారని అన్నారు. లౌకికయేతర జాతీయ సమస్యలపై ఒక్కసారి కూడా ఆ ఎంపీలు తమ వాణి వినిపించలేదని విమర్శించారు. శశి థరూర్‌, కె.సి.వేణుగోపాల్‌ వంటి సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు పలువురు సిఎఎను తాము మొదటనుండి వ్యతిరేకిస్తునే వున్నామని చెబుతూ వస్తున్నారు. సిఎఎకు వ్యతిరేకంగా తాను లోక్‌సభలో అనేకసార్లు ప్రసంగించానన్నారు.

➡️