కాంగ్రెస్‌ నేత సామ్‌ పిట్రోడాపై కేసు నమోదు

Mar 10,2025 16:17 #Case, #Sam Pitroda

బెంగళూరు : బెంగళూరులో ప్రభుత్వ భూమిని అక్రమంగా వినియోగించారనే ఆరోపణలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సామ్‌ పిట్రోడాతోపాటు మరికొంతమందిపై సోమవారం ప్రత్యేక భూకబ్జా నిరోధక కోర్టులో కేసు నమోదైంది. కాంగ్రెస్‌ నేత సామ్‌ పిట్రోడా, ఎఫ్‌ఆర్‌ఎల్‌హెచ్‌టి (స్థానిక ఆరోగ్య సంప్రదాయాల పునరుజ్జీవన ఫౌండేషన్‌) సంస్థ వ్యవస్థాపకుడు దర్శన్‌ శంకర్‌, నలుగురు సీనియర్‌ అటవీ శాఖ అధికారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలొచ్చాయి. 1996లో ఎఫ్‌ఆర్‌ఎల్‌హెచ్‌టి సంస్థ యలహంక సమీపంలోని జరకబందే కవల్‌లో ఐదు హెక్టార్ల (12.35 ఎకరాలు) రిజర్వ్‌ ఫారెస్టు భూమిని కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ నుంచి ఐదు సంవత్సరాలు లీజుకు తీసుకుంది. ఈ లీజు గడువు 2001లో అయిపోయింది. అయితే అప్పుడు ఈ భూమి లీజు గడువును మరో పది సంవత్సరాలకు 2011 వరకు పొడిగించారు. 2011కి లీజు గడువు ముగిసినప్పటికీ ఈ సంస్థ అటవీ శాఖ భూమిని గత పధ్నాలుగేళ్లుగా అక్రమంగా ఆక్రమించుకుందని ఆరోపణలొచ్చాయి. ఆ భూమి విలువ 150 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక మార్కెట్‌ విలువ అయితే రూ.300 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఆ భూమిలో పెరిగిన అరుదైన మూలికా మొక్కలను అమ్మడం ద్వారా ఆ సంస్థ ఏటా సుమారు 5 నుండి 6 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. ఈ విషయంపై లోకాయుక్త, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఫిర్యాదు దాఖలైంది. లోకాయుక్తలో నమోదైన ఫిర్యాదు, అటవీశాఖ పత్రాల ఆధారంగా వీరిపై సోమవారం ప్రత్యేక భూకబ్జా నిరోధక కోర్టులో కేసు నమోదైంది.
కాగా, తాను 83 సంవత్సరాలుగా భారత్‌లో ఉంటున్నప్పటికీ తనకెలాంటి భూమి, ఇల్లు లేదు. భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఉన్న హయాంలో కానీ, మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ హయాంలో కానీ తానెలాంటి జీతం తీసుకోలేదని సామ్‌ పిట్రోడా ఇటీవల ఎక్స్‌ పోస్టులో తెలిపారు. సామ్‌ పిట్రోడాకి ఆస్తులున్నాయని మీడియాలో కథనాలొచ్చాయి. వీటికి సమాధానంగా పిట్రోడా ఎక్స్‌ పోస్టులో ఆస్తులపై వివరిస్తూ పోస్టు చేశారు.

➡️