న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ప్రధాని మోడీ, అమిత్‌షాల పెంపుడు కుక్కలా మారిందని కాంగ్రెస్ ఎంపి మాణిక్కమ్ ఠాగూర్ ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఆయన కుమారుడు చైతన్య బఘేల్ నివాసాలపై ఈడి దాడులు చేపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడి ప్రధాని మోడీ, అమిత్‌షాల పెంపుడు కుక్కగా మారిందని అందరికీ తెలుసునని, వారు ఆ కుక్కను ఎక్కడికైనా పంపవచ్చని అన్నారు. భూపేష్ బఘేల్ కాంగ్రెస్‌లో బలమైన నేత అని, ఈ దాడులను ధైర్యంగా ఎదుర్కొంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలుస్తారని అన్నారు. అవి సృష్టించిన నకిలీ కథలతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఎప్పటికైనా అపజయం ఎదుర్కోక తప్పదని దుయ్యబట్టారు. ఛత్తీస్‌గఢ్ ప్రజల కోసం పోరాడినందుకు, సమస్యలను పరిష్కరించినందుకు బఘేల్‌ను ఈ దాడులతో బిజెపి శిక్షిస్తోందని అన్నారు.
