న్యూఢిల్లీ : బడ్జెట్‌లో ఉపాధిహామీ పథకం నిర్లక్ష్యంపై కాంగ్రెస్ మండిపడింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితులు దిగజారుతున్నప్పటికీ.. మోడీ ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌ను రూ.86,000 కోట్ల వద్ద నిలిపివేసిందని కమ్యూనికేషన్ ప్రతినిధి జైరాం రమేష్ ఆదివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇది ఉపాధి హామీ పథకం నిజమైన కేటాయింపులు (ధరల పెరుగుదల కోసం సర్దుబాటు చేయబడిన)లో క్షీణతను సూచిస్తుందని అన్నారు. గాయానికి అవమానం తోడైనట్లు, బడ్జెట్‌లో 20శాతం గత సంవత్సరాల బకాయిలను క్లియర్ చేయడానికి చెల్లించినట్లు అంచనాలు సూచిస్తున్నాయని అన్నారు. ఇది ఉపాధి హామీ పథక పరిధిని తీవ్రంగా తగిస్తుందని, కరువు పీడిత, గ్రామీణ ప్రజలను మరింత పేదరికంలోని నెట్టివేస్తుందని అన్నారు. కార్మికులకు వేతనాల పెంపును కూడా నిరోధిస్తుందని అన్నారు.
కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరంలో కూడా, కనీస సగటు గుర్తించిన వేతన రేటు కేవలం 7శాతం మాత్రమే పెరిగింది. ఇది వినియోగదారుల ధరల సూచి (సిపిఐ) ద్రవ్యోల్బణం 5శాతంగా అంచనావేసిన సమయంలో అని, దీంతో ఉపాధి హామీలో వేతన స్తబ్దత జాతీయ సంక్షోభానికి దారితీస్తుందని అన్నారు. ఈ కీలక భద్రత వలయం పట్ల నిర్లక్ష్యం గ్రామీణ ప్రజల జీవనోపాధి పట్ల ఉదాసీనతను బహిర్గతం చేస్తుందని మండిపడ్డారు.
2023-24లో, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ కోసం కేటాయింపులు రూ. 60,000 కోట్లు అయితే, అదనపు నిధులు అందించబడ్డాయి. వాస్తవ వ్యయం రూ.89,153.71 కోట్లుగా ఉన్నట్లు బడ్జెట్ నివేదిక పేర్కొంది. 2024-25లో అదనపు కేటాయింపులు జరగలేదు.