కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో సరైన ఫలితాలు రాలేదు : ఖర్గే

Jun 8,2024 16:20 #Kharge

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం (జూన్‌ 8) ఢిల్లీలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. అలాగే ఈ సందర్భంగా ‘కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగలేదు. పార్టీ సామర్థ్యానికి, అంచనాలకు తగినట్లు ఈ రాష్ట్రాల్లో ఫలితాలు రాలేదు. ఇలాంటి రాష్ట్రాలపై త్వరలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాం. తక్షణమే వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదు.’ అని ఖర్గే అన్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ మంచి ఫలితాలు సాధించిందని, భవిష్యత్తులో కూడా ఈ ఇండియా బ్లాక్‌ కొనసాగాలని ఖర్గే తెలిపారు.
కాగా, భవిష్యత్తులో జరిగే పార్లమెంటరీ సమావేశాల్లో ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలను ప్రస్తావించాలి. కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. గత పదేళ్ల మోడీ పాలనను ప్రజలు తిరస్కరించారు. దేశవ్యాప్తంగా జరిగిన భారత్‌జోడో యాత్ర వల్ల కాంగ్రెస్‌ పార్టీకి అత్యధిక ఓట్లు, సీట్లు దక్కాయి అని ఖర్గే అన్నారు.

➡️