- హోలీ సందర్భంగా విద్వేషాలకు బిజెపి యత్నం
- కవ్వింపు చర్యల ఉచ్చులో పడొద్దని ప్రజలకు వినతి
- సిపిఎం పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ (డీలిమిటేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గే అవకాశాలు వున్న నేపథ్యంలో దీనిపై ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరముందని సిపిఎం పొలిట్‌బ్యూరో తెలిపింది. అలాగే హోలీ, శుక్రవారం ప్రార్థనలు ఒకే రోజు రావడంతో బిజెపి నేతలు ముస్లింల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలు ఇలాంటి కవ్వింపు చర్యల ఊబిలో పడుకుండా శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఈ నెల 11, 12 తేదీల్లో సమావేశమైన సిపిఎం పొలిట్‌బ్యూరో పలు అంశాలపై చర్చలు జరిపింది. అనంతరం ఒక ప్రకటన జారీ చేసింది. ఆ వివరాలు..
శాంతియుతంగా హోలీ
హోలీ ఉత్సవాలకు సంబంధించి యుపి, బీహార్, మధ్యప్రదేశ్‌కు చెందిన మంత్రులు, ఎంఎల్‌ఎలు సహా పలువురు బిజెపి నేతలు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలను పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. హోలీ పండుగ శుక్రవారం వచ్చింది. రంజాన్ సందర్భంగా ముస్లింల ప్రార్ధనలు కూడా అదే రోజు జరగనున్నాయి. ఈ విషయమై శాంతి భద్రతలను చక్కగా నిర్వహిస్తామని హామీ ఇవ్వడానికి బదులుగా యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కూడా ముస్లింలను బెదిరించారు. ఇటువంటి వ్యాఖ్యలు ముస్లింల్లో ఉద్రిక్తతలు సృష్టించడానికి, వారిని భయపెట్టడానికి ఉద్దేశించినవేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది. శాంతియుతంగా హోలీ పండుగ జరిగేలా కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ఎలాంటి కవ్వింపు చర్యల ఊబిలో పడరాదని అన్ని కమ్యూనిటీలకు విజ్ఞప్తి చేసింది.
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రమూ ఇబ్బంది పడకూడదు
డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల ఏ రాష్ట్రమూ ఇబ్బంది పడకూడదని సిపిఎం పేర్కొంది. 2026 తర్వాత నిర్వహించిన జనగణన ప్రాతిపదికగా శాసనసభా, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాల్సి వుంది. తాజా జనాభా గణాంకాల ప్రకారం పునర్విభజన నిర్వహిస్తే పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోనుంది. అలాంటి తగ్గింపు రాజకీయంగా, ప్రజాస్వామికంగా అన్యాయమైనది, పైగా సమాఖ్య సూత్రాన్ని దెబ్బతీస్తాయి. అందువల్ల ఈ పునర్విభజన ప్రక్రియపై ఏకాభిప్రాయానికి రావాలని పొలిట్‌బ్యూరో కోరుతోంది. ఈ ప్రక్రియలో ఏ రాష్ట్రమూ కూడా సీట్ల వాటా దామాషాలో కుదింపుతో ఇబ్బంది పడకూడదు.
అమెరికా టారిఫ్‌ల బెదిరింపు
అమెరికాకు ఎగుమతి చేసే భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరిస్తున్నారు. ఏప్రిల్ 2 నుండి ప్రతీకార సుంకాలు విధిస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ మోడీ ప్రభుత్వం ఈ అంశంపై మౌనం పాటిస్తోంది. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి ట్రంప్‌తో రాజీ పడేందుకు ప్రయత్నిస్తోంది. భారత పరిశ్రమల ప్రయోజనాలపై భారత ప్రభుత్వం ధృఢమైన వైఖరి తీసుకోవాలని, తగు ప్రతీకార చర్యలు తీసుకోవాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.
పార్టీ మహాసభ
పార్టీ 24వ అఖిల భారత మహాసభ కోసం రాజకీయ నిర్మాణ నివేదిక ముసాయిదాపై పొలిట్‌బ్యూరో చర్చించింది. మార్చి 22, 23 తేదీల్లో జరిగే కేంద్ర కమిటీ సమావేశంలో ఈ ముసాయిదాను ప్రవేశపెట్టి, చర్చించిన అనంతరం ఆమోదిస్తారు.