- ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ పాల్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తిరుమల లడ్డూ వివాదంతో హిందువులకు, క్రైస్తవులకు మధ్య విభేదాలు సృష్టించే కుట్ర జరుగుతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ పాల్ అన్నారు. ఈ విభేదాలను ఆపాలనే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. మంగళవారం నాడిక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ వివాదంతో తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ప్రతిష్ట దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ వివాదంపై రాజకీయన నేతలు మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విన్నవించినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం రాత్రి కలిసినట్లు పాల్ చెప్పారు. ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతల అంశం గురించి ఆయనతో చర్చించినట్లు తెలిపారు. వందల కొద్ది ఇళ్లను ఎలాంటి నిబంధనలు, పద్ధతులు పాటించకుండా కూల్చేయడం సరికాదని రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు పాల్ చెప్పారు.