రాజ్యాంగ పరిరక్షణ అత్యవసరం

  • సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి
  • అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నివాళి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యాంగాన్ని పరిరక్షణ అత్యవసరమని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి సోమవారం స్పష్టం చేశారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సోమవారం పార్లమెంట్‌ స్ట్రీట్‌లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దళిత్‌ సోషన్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎస్‌ఎం) నిర్వహించిన స్టాల్‌లో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం సీనియర్‌ నాయకురాలు బృంద కరత్‌, పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు, ఆర్‌. అరుణ్‌ కుమార్‌, సీనియర్‌ నేత హన్నన్‌ మొల్లా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎం.ఎ బేబి మాట్లాడుతూ కుల రహిత సమాజ స్థాపనే, అంబేద్కర్‌ కు మనమిచ్చే ఘన నివాళి తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం అంబేద్కర్‌ ఎల్లప్పుడూ పోరాడారని గుర్తు చేశారు. భారత సమాజం సామాజిక నిర్మాణాన్ని రూపొందించే వైవిధ్యాన్ని అంబేద్కర్‌ ఎల్లప్పుడూ విశ్వసించారన్నారు. ఈ వైవిధ్యానికి చెందిన వారందరి హక్కులను కాపాడటానికి భారత రాజ్యాంగాన్ని విశ్వసించారన్నారు. అయితే నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎల్లప్పుడూ దేశంలోని కార్మిక వర్గంలో విభజన సృష్టించడానికి విభజన రాజకీయాల వ్యూహాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడాలని, హిందూత్వాన్ని తిరస్కరించాలని పిలుపు ఇచ్చారు. వ్యవసాయ కార్మికుల హక్కులను కాపాడాలని, కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదని, రాజ్యాంగ విలువలు, సూత్రాల పట్ల కూడా గొప్ప విశ్వాసి అని అన్నారు. కానీ నేడు భారతీయ వైవిధ్యం, రాజ్యాంగానికి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నుంచి ముప్పు పొంచి ఉందన్నారు. లింగం, కులం, మతం ఆధారంగా శ్రామిక ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. హిందూత్వ, మనువాదం, అన్ని రకాల సామాజిక వివక్షతలకు వ్యతిరేకంగా నిజమైన పోరాటాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటానికి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. మత రాజకీయాలను ఎదుర్కోవడంతో పాటు, కార్పొరేట్‌లతో పాటు గ్రామీణ సంపన్నులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటాన్ని వారి నిర్దిష్ట ప్రాంతాలలో ముందుకు తీసుకెళ్లడానికి ఎఐఎడబ్ల్యుయు అన్ని యూనిట్లను సమీకరించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ కార్మికులందరూ గ్రామీణ సంపన్నులకు వ్యతిరేకంగా పోరాడటానికి ఐక్యంగా ఉండాలని తెలిపారు.

➡️