– గడువు ముగిసినా..ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించని జాతీయ బ్యాంకు
– దురుద్ధేశ్యపూరిత చర్యగా పేర్కొన్న ఎడిఆర్, కామన్‌కాజ్
– సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల అమ్మకపు వివరాలను వెల్లడించడంలో విఫలమైన భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బిఐ)పై గురువారం కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఎడిఆర్) సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని సత్వరమే విచారణకు చేపట్టాలని కోరారు. 2019 ఏప్రిల్ నుండి విక్రయించిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీ లోగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలంటూ సుప్రీంకోర్టు ఎస్‌బిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే గడువు ముగిసినప్పటికీ ఎస్‌బిఐ ఆ వివరాలు అందజేయలేదు.
ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించేందుకు జూన్ 30వ తేదీ వరకూ గడువు ఇవ్వాలని ఎస్‌బిఐ చైర్మెన్ దినేష్ కుమార్ ఖేరా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారం, పత్రాలు దేశంలోని వివిధ ఎస్‌బిఐ శాఖలలో ఉన్నాయని, వీటన్నింటినీ డీకోడింగ్ చేయడం కష్టమైన పని అని, కొంత సమయం అవసరమవుతుందని తెలిపారు. తొమ్మిది పేజీలతో కూడిన ఎస్‌బిఐ దరఖాస్తుపై వచ్చే ఈ నెల 11న సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్‌బిఐ దరఖాస్తుతో పాటే కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కూడా అదే రోజు విచారించాలని ప్రశాంత్ భూషణ్ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ దరఖాస్తు నెంబరుతో వివరాలను ఇ-మెయిల్ ద్వారా పంపాలని సూచించారు. ‘మీ పిటిషన్‌ను రిజిస్ట్రీ వెరిఫై చేయగానే మీ జూనియర్లు ఇ-మెయిల్ పంపవచ్చు. నేను ఆదేశాలు జారీ చేస్తాను’ అని ఆయన తెలిపారు. ఎడీఆర్‌తో పాటు కామన్‌కాజ్ అనే సంస్థ కూడా ఈ పిటిషన్‌లో భాగస్వామి అయింది.
ఎన్నికల బాండ్ల పథకాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఎడిఆర్ కూడా ఉంది. ఈ పిటిషన్లపై గత నెల 15న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరిస్తూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలను మార్చి 6 లోగా ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని ఎస్‌బిఐని ఆదేశించింది. ఆ వివరాలను మార్చి 13వ తేదీ లోగా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని ఎన్నికల కమిషన్‌ను కూడా ఆదేశించింది. ఈ ప్రక్రియ యావత్తూ సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందే పూర్తయితే ఓటర్లు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.
ఎడిఆర్ పిటిషన్‌లో ఏముంది?
కోర్టు ఆదేశాలను ఎస్‌బిఐ ఉద్దేశపూర్వకంగానే ధిక్కరించిందని, ఆ బ్యాంకుపై చర్యలు చేపట్టాలని ఎడిఆర్, కామన్‌కాజ్ సంస్థలు తమ పిటిషన్‌లో కోరాయి. పిటిషనర్ల తరఫున ప్రశాంత్ భూషణతో పాటు న్యాయవాదులు ఛెరస్ డి సౌజా, నేహా రథి కోర్టుకు హాజరయ్యారు. గడువు పొడిగించాలంటూ ఎస్‌బీఐ సమర్పించిన దరఖాస్తు దురుద్దేశపూరితంగా ఉన్నదని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను విఘాతం కలిగించేందుకు ఆ బ్యాంక్ ప్రయత్నిస్తోందని ఎడిఆర్ పేర్కొంది. ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించేందుకు ఎస్‌బిఐకి మరింత సమయం అవసరం లేదని, ఆ సమాచారాన్ని బహిర్గతం చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఆ బ్యాంకుకు ఉన్నాయని తెలిపింది. ఎన్నికల బాండ్ల నిర్వహణ కోసం ఎస్‌బిఐకి ఇప్పటికే ఐటీ వ్యవస్థ ఉన్నదని గుర్తు చేసింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అవసరమని ఎడిఆర్ పునరుద్ఘాటించింది. రాజకీయ పార్టీలకు ఎవరు విరాళాలు అందజేశారు, ఎంత మొత్తంలో ఇచ్చారు అనే సమాచారాన్ని తెలుసుకునే ప్రాథమిక హక్కు రాజ్యాంగంలోని 19 (1) (ఏ) ద్వారా ప్రజలకు సంక్రమించిందని వాదించింది. ‘వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు అందించిన వారి వివరాలు ఎన్నికల లోగా ప్రజలకు తెలియకుండా ఉంచేందుకు ఎస్‌బిఐ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోంది. పైగా బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా, త్వరగా తెలుసుకోవచ్చునంటూ 2019 మార్చి 15న కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌కు ఎస్‌బిఐ వైఖరి భిన్నంగా ఉంది’ అని తెలిపింది. మరోవైపు బాండ్ల వివరాలు వెల్లడించేందుకు ఎస్‌బిఐ గడువు కోరడాన్ని ప్రతిపక్షాలతో పాటు బ్యాంక్ ఉద్యోగుల సంఘం కూడా వ్యతిరేకిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం బ్యాంకులను ఉపయోగించుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బెఫి) పేర్కొంది. ఈ మేరకు బెఫి కార్యదర్శి ఎస్. సతీష్ రావు ప్రకటన విడుదల చేశారు.
విరాళాలను ఫ్రీజ్ చేయాలి : ఇఎఎస్ శర్మ
2017-18 నుండి 2022-23 వరకూ రూ.12,008 కోట్ల విలువ కలిగిన ఎన్నికల బాండ్లను విక్రయించారని ఏడీఆర్ తెలిపింది. వీటిలో బిజెపికి రూ.6,564 కోట్లు (సుమారు 55%) అందాయి. ఈ ఐదు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్‌కు అందిన విరాళాలు కేవలం రూ.1,135 కోట్లు (9.5%) మాత్రమే. అదే కాలంలో తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.1,096 కోట్ల విరాళం లభించింది. కాగా రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు పొందిన సొమ్మును స్తంభింపజేయాలంటూ మాజీ అధికారి ఇఎఎస్ శర్మ ఎన్నికల కమిషన్‌ను కోరారు. వివరాలు అందజేయడానికి లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకూ ఎస్‌బీఐ గడువు కోరిన నేపథ్యంలో ఎన్నికల బాండ్ల ద్వారా పార్టీలు పొందిన విరాళాలను ఎన్నికల కమిషన్ కానీ లేదా సుప్రీంకోర్టు కానీ స్తంభింపజేయాలని పలువురు నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.