అహ్మద్‌ పటేల్‌ వారసత్వాన్ని వృథా కానివ్వం : ముంతాజ్‌ పటేల్‌

Feb 24,2024 18:17 #AAP, #Congress, #Gujarat

అహ్మదాబాద్‌: ఆప్‌, కాంగ్రెస్‌ పొత్తుల్లో భాగంగా.. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్‌కి గుజరాత్‌లో రెండు ఎంపీ సీట్లను ఆఫర్‌ చేసింది. ఈమేరకు రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. అయితే కాంగ్రెస్‌ భారాచా ఎంపీ సీటును ఆప్‌కి కేటాయించడంపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. తాజాగా అహ్మద్‌ పటేల్‌ కుమార్తె ముంతాజ్‌ పటేల్‌ ‘భారుచా జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తలు, పార్టీ కేడర్‌కు క్షమాపణలు చెబుతున్నా. పొత్తలో భాగంగా భారుచా లోక్‌సభ స్థానం పొందలేకపోయాం. మీ నిరాశను నేను పంచుకుంటాను. మనమంతా కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. 45 ఏళ్ల అహ్మద్‌ పటేల్‌ వారసత్వాన్ని వృథా కానివ్వం.’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. భారుచా స్థానంపై ముంతాజ్‌ ఆశ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారుచా సీటు దక్కకపోవడం వల్ల ఆమె తన జిల్లా కేడర్‌కు క్షమాపణలు చెప్పినట్లు చర్చ జరుగుతోంది.

మరోవైపు.. అహ్మద్‌ పటేల్‌ కుమారుడు ఫైసల్‌ కూడా భారుచా సీటుపై స్పందించారు. ‘నేను మరోసారి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కలిసి మాట్లాడుతా. నామినేషన్‌ వేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. భారుచా లోక్‌సభ స్థానానికి సంబంధించి.. అహ్మద్‌ పటేల్‌ కుటుంబానికి ఉన్న సెంటిమెంట్‌ను పార్టీ అధిష్టానం అర్థం చేసుకుంటుందని నేను ఆశిస్తున్నా’ అని తెలిపారు. పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంపై కార్యకర్తలు గానీ, నేను కానీ సంతోషంగా లేము. అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోకూడదని మేము కోరుకున్నాము. కానీ కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీసుకుంది. హైకమాండ్‌ తీసుకున్న నిర్ణయాన్ని నేను, కార్యకర్తలం అనుసరిస్తాం. అని అని ఫైసల్‌ పేర్కొన్నారు.

➡️