- యుజిసి ముసాయిదా నిబంధనలను కేంద్రం వెనక్కి తీసుకోవాలి
- కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
తిరువనంతపురం : యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజిసి) తీసుకొచ్చిన వివాదాస్పద ముసాయిదా నిబంధనలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా నిబంధనలు సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. యుజిసి ముసాయిదా నిబంధనలను వ్యతిరేకిస్తూ కేరళ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్రం చర్యపై అధికార సిపిఎం, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఇది ఉన్నత విద్యకు సంబంధించి సంఫ్‌ు పరివార్ ఎజెండాలో భాగమని ఆరోపించాయి.
తొలి రాష్ట్రంగా కేరళ
ఈ తీర్మానాన్ని సీఎం విజయన్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో యూజీసీ ముసాయిదా నిబంధనలకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్రంగా కేరళ నిలిచింది. సమాఖ్య సూత్రాలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు యూజీసీ ముసాయిదా వ్యతిరేకమని సీఎం విజయన్ అన్నారు.”వీసీల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని ఇది పూర్తిగా తొలగిస్తుంది. రాజ్యాంగ స్ఫూర్తిని గ్రహించదు” అని తీర్మానంలో పేర్కొన్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యావేత్తలు లేవనెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు సీఎం తెలిపారు. ముసాయిదా నిబంధనలు ఉన్నత విద్యా రంగాన్ని వాణిజ్యీకరించే చేసే చర్యగా విజయన్ అభివర్ణించారు. ఉన్నత విద్యను మతోన్మాదుల చేతుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంగా ఈ నిబంధనలను చూడొచ్చని తీర్మానంలో వివరించారు.
ఉన్నత విద్యా సంస్థల్లో వైస్-చాన్సలర్ల నియమాకాలకు సంబంధించి రాష్ట్రాల్లో గవర్నర్లకు విస్తృత అధికారాలను కట్టబెడుతూ యూజీసీ ఇటీవల కొత్త నిబంధనలను విడుదల చేసింది. సాధారణంగా ఈ నియామకాలను విద్యావేత్తలతో భర్తీ చేసేవారు. ఈ వివాదాస్పద యుజిసి ముసాయిదా నిబంధనలపై దేశవ్యాప్తంగా పలువురు విద్యావేత్తలతో పాటు వివిధ ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. యుజిసి చర్యను తప్పుబడుతున్నాయి. గవర్నర్ల ద్వారా రాష్ట్రాల్లోని ఉన్నత విద్యాసంస్థలపై కేంద్రం పెత్తనం చెలాయించే అవకాశాలున్నాయంటూ అనమానాలను వ్యక్తం చేస్తున్నాయి.