- ప్రధాని మోడీకి కేరళ సిఎం పినరయి విజయన్ వినతి
ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : కొండచరియలు విరిగిపడి చిన్నాభిన్నం అయిన వయనాడ్ పునరుజ్జీవనానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ఈ మేరకు మంగళవారం నాడిక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వయనాడ్ విపత్తుపైనే ప్రధానంగా ఆయన మోడీతో చర్చించారు. ఈ విపత్తులో సర్వం కోల్పోయిన బాధితుల పునరావాసం కోసం కేంద్రం ఉదారంగా స్పందించి సముచితమైనరీతిలో ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని విజయన్ కోరినట్లు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) తెలిపింది. ఈ విపత్తుపై వివరణాత్మక సమగ్ర నివేదికను కూడా ప్రధానికి ముఖ్యమంత్రి అందజేసినట్లు పేర్కొంది. మరోవైపు వయనాడ్ పునరావాసంతో సహా బాధితులను ఆదుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు పినరయి విజయన్ గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా బాధిత కుటుంబాలకు శాశ్వత వసతి ఏర్పాటు చేయడం పెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో అన్ని వసతులతో కూడిన టౌన్‌షిప్‌ను సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీల నేతలతో పాటు రెవెన్యూ, అటవీ, జలవనరులు, విద్యుత్తు, రవాణా, రిజిస్ట్రేషన్, ఆర్థిక, పబ్లిక్ వర్క్స్, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన సంక్షేమ శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. వయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడడంతో 308 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. మెప్పాడి ప్రాంతంలోని చూరల్‌మల, ముండక్కై ప్రాంతాలు పూర్తిస్థాయిలో విధ్వంసానికి గురయ్యాయి.