న్యూఢిల్లీ : విశ్వాసం లేకుండా కేవలం ఉద్యోగం కోసం మతమార్పిడులు రిజర్వేషన్ విధానానికి విరుద్ధం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. పుదుచ్చేరికి చెందిన సి.సెల్వరాణి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది. క్రిస్టియన్ కమ్యూనిటీలో పుట్టినప్పటికీ, తర్వాత హిందూ మతం స్వీకరించినందున తనకు ఎస్‌సి సర్టిఫికేట్‌ను జారీ చేయాలని ఆ మహిళ పిటిషన్‌లో కోరింది. ఎస్‌సి కోటాలో ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు ఉద్దేశ్యపూర్వకంగా హిందూమతంలో చేరినట్లు తెలుస్తోందని కోర్టు పేర్కొంది.
”భారత్ లౌకిక దేశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. ప్రతి పౌరుడు తమకి నచ్చిన మతాన్ని ఆచరించడానికి, ప్రకటించడానికి హక్కు ఉంది. వేరే మతంలోకి మారవచ్చు. అయితే దాని సూత్రాలు, సిద్ధాంతాల ద్వారా నిజమైన ప్రేరణ పొందినపుడు వేరే మతంలోకి మారవచ్చు. కానీ రిజర్వేషన్ ప్రయోజనాల కోసం మాత్రమే మతం మారడాన్ని అనుమతించలేము. ఇది రిజర్వేషన్లకు వ్యతిరేకం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే” అని జస్టిస్ పంకజ్ మిథాల్, ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం పేర్కొంది.