సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : చట్టాన్ని ఫలాన విధంగానే రూపొందించాలని న్యాయస్థానాలు శాసన వ్యవస్థను ఆదేశించలేవని సుప్రీం కోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై పిల్‌ను పరిష్కరించిన ఢిల్లీ హైకోర్టు గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారిస్తూ జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ అగస్టిన్ జార్జితో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ప్రతి అంశాన్ని పరిశీలించి పార్లమెంట్ కొత్త చట్టాన్ని తీసుకువస్తుంది. రిట్ పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టులు లేదా సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఈ తరహాలోనే చట్టాన్ని ఆమోదించాలని చట్టసభను ఆదేశించలేవు.’ అని బెంచ్ పేర్కొంది. ఈ పిటిషన్ విచారణకు తిరస్కరించింది.
కేంద్రం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్)లో సెక్షన్ 230ని ప్రస్తావిస్తూ, ఆ పిటిషన్ చెల్లనిదిగా పేర్కొన్నారు. పోలీసు రిపోర్ట్‌పై విచారణా చర్యలు చేపట్టిన ఏ కేసులోనైనా మేజిస్ట్రేట్ అందుకు సంబంధించిన పత్రాల కాపీని నిందితుడు, బాధితులకు అందచేయాలని సెక్షన్ 230 చెబుతోందని పేర్కొన్నారు. పోలీసు రిపోర్టుతో పాటు ఎఫ్‌ఐఆర్ నివేదిక కూడా అందచేయాల్సి వుంటుందన్నారు. కానీ ఫిర్యాదీదారుడు లేదా బాధితుని వాదనలను వినాల్సిన, లేదా విచారణకు ముందస్తు క్రిమినల్స్ ప్రొసీడింగ్స్‌లో పాల్గొనాల్సిన హక్కు గురించి ఈ సెక్షన్ చెప్పడం లేదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఫిర్యాదీదారులు లేదా బాధితులకు ఉచితంగా చార్జిషీట్ కాపీని అందచేయాలని ఆ మేరకు జిల్లా కోర్టులకు, లేదా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆ పిల్ కోరింది. దానిపై గతేడాది విచారించిన ఢిల్లీ హైకోర్టు అవసరమైతే విచారణ ముందస్తు, విచారణా సమయాల్లో జరిగే కార్యకలాపాల్లో పాల్గొనేందుకు బాధితులు లేదా ఫిర్యాదీదారులకు తగినన్ని హక్కులు ఇవ్వబడ్డాయని తెలిపింది.
