- ప్రార్థనా స్థలాల చట్టాన్ని కచ్చితంగా అమలుచేయాలి
- వయనాడ్ బాధితుల పట్ల కేంద్రం వివక్ష వీడాలి
- సిపిఎం పొలిట్‌బ్యూరో ప్రకటన
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లో మైనార్టీ మతస్తులకు పూర్తి స్థాయిలో రక్షణ, భద్రత కల్పించాలని, ప్రార్థనా స్థలాల చట్టాన్ని తు.చ తప్పకుండా అమలు చేయాలని, గ్రేటర్ నోయిడా రైతుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ఈనెల 7,8 తేదీల్లో రెండు రోజుల పాటు ఇక్కడ సమావేశమైన పొలిట్‌బ్యూరో సోమవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. యుపిలో రైతుల పోరాటానికి మద్దతు తెలిపింది. వయనాడ్ బాధితులకు తక్షణమే నిధులు అందజేయాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్‌లో మతపరమైన మైనారిటీలకు భద్రత, పూర్తి స్థాయి రక్షణ కల్పించేలా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని పొలిట్‌బ్యూరో పునరుద్ఘాటించింది. ఇందుకు సంబంధించి ఇస్లామిస్ట్ ఛాందసవాద శక్తుల కార్యకలాపాలను పాలనా యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే సమయంలో, భారత్‌లో ఈ అంశంపై రెచ్చగొట్టే ప్రచారం చేస్తూ ప్రజల మనోభావాలతో చెలగాటమాడేందుకు బిజెపి – ఆర్‌ఎస్‌ఎస్, తీవ్ర హిందూత్వ సంస్థలు యత్నించడాన్ని పొలిట్‌బ్యూరో నిరసించింది. ఇటువంటి ధోరణి బంగ్లాదేశ్‌లోని మైనారిటీల ప్రయోజనాలకు ఏ విధంగాను తోడ్పడదని పేర్కొంది. భారత్, బంగ్లాదేశ్‌ల్లో సరిహద్దులకు ఇరువైపులా గల ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే అన్ని రకాల మతోన్మాదానికి వ్యతిరేకంగా బలంగా చేతులు కలపాలని ఇరు దేశాల్లోని లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది.
ప్రార్థనా స్థలాల చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి
శతాబ్దాల నాటి మసీదులు వున్న ప్రదేశాలన్నీ ఒకప్పుడు ఆలయాలంటూ దిగువ కోర్టుల్లో కేసులు ఎక్కువగా నమోదవుతుండడం పట్ల పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారణాసి, మథుర తర్వాత ఇప్పుడు సంభాల్‌లో 16వ శతాబ్దానికి చెందిన మసీదుపై సర్వే చేపట్టాల్సిందిగా దిగువ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా హింస చెలరేగింది. నలుగురు ముస్లిం యువకులు మరణించారు. ఆ తర్వాత అజ్మీర్‌లోని సివిల్ కోర్టులో అజ్మీర్ షరీఫ్ దర్గాకి సంబంధించి ఇటువంటి పిటిషనే ఒకటి నమోదైంది. ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం, 1991ని పరిరక్షించడం ద్వారా ఇటువంటి వ్యాజ్యాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోవడం దురదృష్టకరమని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో 2019 నాటి ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ చట్టం చెల్లుబాటును, దీని అమలును చాలా స్పష్టంగా సమర్ధిస్తూ తీర్పు చెప్పింది. ఆ ఆదేశాల నేపథ్యంలో, సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకుని, చట్టాన్ని ఉల్లంఘించే ఇటువంటి చట్టపరమైన లావాదేవీలన్నింటికీ స్వస్తి పలకడం అవసరం.
వయనాడ్ బాధితులకు తక్షణమే నిధులు
వయనాడ్‌లో కొండచరియలు కూలిపడి పెను విపత్తు సంభవించిన నేపథ్యంలో బాధితులకు సాయం అందేలా చూడకుండా కేరళ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని పొలిట్‌బ్యూరో తీవ్రంగా విమర్శించింది. తక్షణ సాయంగా రూ.214.68 కోట్లు, సమగ్ర పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులకు రూ.2,319.1కోట్లు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసి నాలుగు మాసాలు గడిచినా ఇంతవరకు ఆ నిధులకు ఆమోదం తెలపకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించింది. కొండచరియలు విరిగిపడడాన్ని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా ప్రకటించడానికి కేంద్రం నిరాకరించడం, పైగా బాధిత కుటుంబాలకు రుణాలు రద్దు చేయడానికి సుముఖంగా లేకపోవడం చూస్తుంటే కేంద్రం అన్యాయమైన, అమానవీయమైన వైఖరి స్పష్టమవుతోంది. సంక్షోభ సమయాల్లో సయితం ఫెడరలిజం సూత్రాలను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరించడం దారుణమని విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన నిధులను తక్షణమే విడుదల చేయాలని పొలిట్‌బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
నోయిడా రైతుల పోరాటానికి మద్దతు
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో రైతులపై పోలీసుల అణచివేత చర్యలను సిపిఎం తీవ్రంగా ఖండించింది. అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్), ఇతర సంఘాలకు చెందిన దాదాపు 150 మంది నేతలు, కార్యకర్తలు జైలు పాలయ్యారు. అరెస్టయిన రైతులు జైల్లో నిరాహార దీక్ష చేపట్టారు. ఇంకా అనేకమంది కార్యకర్తల గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఈ పోరాటం అగ్ర భాగాన వున్న మహిళలపై పోలీసులు దాడి చేయడం దిగ్బ్రాంతి కలిగించింది.
45 గ్రామాలకు చెందిన రైతులు ఈ గ్రేటర్ నోయిడా పోరాటం చేపట్టారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం గత కొంతకాలంగా వీరి భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తమకు అందే నష్టపరిహారం రేట్లను సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 1997లో కుదిరిన ఒప్పందం ప్రకారం రైతులకు ప్లాట్‌లను కేటాయించాలని కోరుతున్నారు. తప్పనిసరి ఉపాధి విధానం అమలు చేయడంతోపాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఈ పోరాటానికి సిపిఎం పూర్తిగా మద్దతిస్తోంది. రైతులపై ఈ అణచివేత చర్యలు తక్షణమే ఆపాలని కోరుతోంది. రైతుల న్యాయమైన డిమాండ్లను తప్పనిసరిగా ఆమోదించి, అమలు చేయాలని కోరింది.
పార్టీ మహాసభ సన్నాహాలు
వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటివారంలో జరగనున్న పార్టీ 24వ అఖిలభారత మహాసభలో చేపట్టనున్న ముసాయిదా రాజకీయ తీర్మానంపౖౖె పొలిట్‌బ్యూరో చర్చించింది. ఈ చర్చ ఆధారంగా కోల్‌కతాలో జనవరి 17-19 తేదీల్లో సమావేశమయ్యే కేంద్ర కమిటీ ముందు ఆమోదానికి ఉంచుతారు.