బడ్జెట్‌ సమావేశాల్లో ఆరీఫ్‌ తీరుపై సిపిఎం విమర్శలు

  • గవర్నరు తీరు బాధ్యతారాహిత్యం
  • రాజ్యాంగ విధుల పట్ల నిర్లక్ష్యం

తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విధాన ప్రసంగాన్ని రాష్ట్ర గవర్నరు ఆరీఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ కొన్ని సెకన్లలోనే ముగించడాన్ని సిపిఎం కేరళ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగ విధుల పట్ల ఆయన నిర్లక్ష్య ధోరణిని ఇది అద్దం పట్టిందని విమర్శించింది. స్థానిక ఎకెజి సెంటర్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ మీడియాతో మాట్లాడుతూ శాసనసభ సమావేశాల్లో గవర్నరు స్థాయికి తగినట్లుగా కాకుండా ఆరీఫ్‌ దిగజారి వ్యవహరించారని తప్పుబట్టారు. రాజ్యాంగ విధుల పట్ల నిర్లక్ష్యంగా, పట్టీపట్టని రీతిలో వ్యవహరించారని తీవ్రంగా విమర్శించారు. వాస్తవానికి ‘సహకార సమాఖ్యవాదం ప్రాముఖ్యత’ను నొక్కి చెబుతున్న పేరాగ్రాఫ్‌ను చదవడం ద్వారా గవర్నరు ప్రసంగ సారాంశాన్ని తెలియజేశారని, కానీ సభలో ఆయన వ్యవహార శైలి చాలా అవమానకరంగా వుందని గోవిందన్‌ పేర్కొన్నారు. ఈ నెల 25న కేరళ బడ్జెట్‌ సమావేశాల్లో కేవలం 75 సెకన్లలో గవర్నరు తన ప్రసంగాన్ని ముగించిన సంగతి విదితమే.

మత ఘర్షణలపై ఆందోళన

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత దేశంలో పలు చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకోవడం ఆందోళనకరమని గోవిందన్‌ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు చోట్ల ముస్లింలు, క్రైస్తవులపై దాడులు చేసేలా సంఘపరివార్‌ ఉద్దేశ్యపూర్వకంగా ప్రేరేపిస్తోందని ఆయన విమర్శించారు. హిందూత్వ ఓట్లను రాబట్టుకునే లక్ష్యంతో మత సామరస్యతను దెబ్బతీసేలా, మైనారిటీలను చెడ్డగా చిత్రీకరిస్తూ విద్వేషాలను రాజేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

➡️