న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యుల హక్కుల ఉల్లంఘనను ఆపాలని సిపిఎం డిమాండ్ చేసింది. పార్టీ పొలిట్‌బ్యూరో శనివారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేస్తూ, వెనిజులా రాజధాని కారకస్‌లో ఫాసిజానికి వ్యతిరేకంగా పార్లమెంటేరియన్ల ఫోరం కార్యక్రమానికి హాజరయ్యేందుకు గానూ సిపిఎం రాజ్యసభ సభ్యులు డాక్టర్ వి.శివదాసన్ కు రాజకీయ అనుమతిని నిరాకరించిన కేంద్ర ప్రభుత్వ చర్యను పొలిట్‌బ్యూరో ఖండించింది. పాలక పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా లేని వాణిని అణచివేసేందుకు జరిగిన యత్నమే ఇది అని విమర్శించింది. వెనిజులా నేషనల్ అసెంబ్లీ నిర్వహిస్తున్న పార్లమెంటేరియన్ల ఫోరం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సిపిఎంకు వెనిజులా పార్లమెంట్ నుండి ఆహ్వా నం అందింది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు డాక్టర్ వి.శివదాసన్‌ను పార్టీ నామినేట్ చేసింది. ఈ కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు పాల్గొంటున్నారు.
ఎఫ్‌సిఆర్‌ఎ అనుమతి లభించినా విదేశాంగ శాఖ, శివదాసన్‌కు రాజకీయ అనుమతిని నిరాకరించడం తీవ్ర విచారకరమని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఇది ఒక పార్లమెంట్ సభ్యునిగా ఆయనకు గల హక్కులను ఉల్లంఘించడమేనని విమర్శించింది. రాజకీయ వివక్ష విధానాన్ని కేంద్రం అనుసరిస్తోందని సిపిఎం విమర్శించింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా లేని వ్యక్తులు తమ అభిప్రాయాలు తెలియజేయకుండా వారి నోరు నొక్కడమే కాగలదని పేర్కొంది. ఈ అంశం ప్రతిపక్షాలకు, పార్లమెంట్ సభ్యులకు తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది.
విదేశాంగ మంత్రికి సిపిఎం ఎంపి లేఖ
నవంబరు 4-6 తేదీల్లో కారకస్‌లో జరిగే కార్యక్రమానికి తనకు రాజకీయ అనుమతి నిరాకరించడంపై ఎంపి వి.శివదాసన్ విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ఒక లేఖ రాశారు.